వాషింగ్టన్ : రష్యాపై ఆంక్షలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికా చట్టసభ సభ్యులు రెండు సవరణలను ప్రతిపాదించారు. భారత్ సహా రష్యా ప్రధాన వాణిజ్య భాగస్వాములను ఆంక్షల పరిధిలోకి తీసుకురావాలని ఒక సవరణ కోరుతుండగా, మరో సవరణ బిల్లులోని ద్వితీయ సుంకాలకు సంబంధించిన సెక్షన్ 113ను పూర్తిగా తొలగించాలని ప్రతిపాదించింది. ఈ సవరణలను హౌస్ రూల్స్ కమిటీ సోమవారం వెల్లడించింది. లిండ్సే గ్రాహం ప్రతిపాదిత రష్యా, ఇరాన్ ఆంక్షల బిల్లును ఆగస్టు 7న అమెరికా సెనెట్ 86–11 ఓట్ల తేడాతో ఆమోదించింది. రష్యా నాయకత్వం, ఇంధన రంగంతోపాటు చమురు ఎగుమతులపై ఆంక్షలను తప్పించుకునేందుకు మాస్కోకు సహకరిస్తున్న ‘షాడో ఫ్లీట్’ నౌకలపైనా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. రష్యా ముడి చమురు వాణిజ్యం ఉక్రెయిన్‌పై యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా చమురు, గ్యాస్‌కు ప్రధాన దిగుమతిదారులైన దేశాలపై 100 శాతం సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు ట్రంప్‌కు కల్పించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.
డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు స్టెనీ హోయర్ ప్రవేశపెట్టిన సవరణలో చైనా, భారత్, టర్కీ, అజర్‌బైజాన్, హంగేరి, స్లోవాక్ రిపబ్లిక్, యూఏఈ, సింగపూర్, కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్‌లను 100 శాతం సుంకాలకు అర్హత ఉన్న దేశాలుగా పేర్కొనాలని కోరారు. అధ్యక్షుడికి అదనపు సుంకాలు విధించే అధికారాలను కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్న డెమొక్రాటిక్ సభ్యుడు గ్రెగొరీ మీక్స్, రష్యా వాణిజ్య భాగస్వాములపై ద్వితీయ సుంకాలు విధించే అధికారాన్ని కల్పించే సెక్షన్ 113ను తొలగించాలని సవరణను ప్రవేశపెట్టారు. మీక్స్ ప్రతిపాదించిన మరో సవరణ ప్రకారం, విదేశీ దేశంపై విధించిన ఆంక్షలను అధ్యక్షుడు 90 రోజులపాటు మాఫీ చేయవచ్చు. అమెరికా జాతీయ భద్రతకు అత్యంత కీలకమని భావించిన సందర్భంలో మరో 90 రోజులు మాఫీని పొడిగించేందుకు వీలుంటుంది. అలాగే, రక్షణ సామాగ్రి, సేవల కొనుగోలుకు నిధులు సమకూర్చేందుకు ఉక్రెయిన్‌కు 15 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష రుణాలు అందించే ప్రతిపాదనను కూడా ఆయన ప్రస్తావించారు.
అయితే ఈ బిల్లు చట్టంగా మారాలంటే ప్రతినిధుల సభ ఆమోదంతోపాటు అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయాల్సి వుంది. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో సభ ముందస్తు విరామానికి వెళ్లేందుకు ఇంకా నాలుగు పనిదినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.







కామెంట్‌లు (0)