వాషింగ్టన్ : కరేబియన్ సముద్రంలో ఓ నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించినట్లు మంగళవారం వెల్లడించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న “నార్కో-టెర్రరిస్టులను” లక్ష్యంగా చేసుకుని అమెరికా నిర్వహిస్తున్న వరుస దాడుల్లో ఇది తాజాది. అయితే, ఈ దాడిని మానవ హక్కుల సంఘాలు ఖండిస్తూ వీటిని, చట్టేతర హత్యలుగా పేర్కొన్నాయి. అమెరికా సదరన్ కమాండ్ సోషల్ మీడియా పోస్ట్‌లో, ధృవీకరించిన నిఘా సమాచారం ఆధారంగా ఆ నౌక మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో చురుకుగా పాల్గొంటున్నట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో నలుగురు “నార్కో-టెర్రరిస్టులు” హతమైనట్లు తెలిపింది. అయితే, మరణించిన వారి వివరాలను అమెరికా సైన్యం వెల్లడించలేదు. అలాగే దాడి జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని కూడా పేర్కొనలేదు. ఆ నౌక కరేబియన్‌లోని మాదకద్రవ్యాల అక్రమ రవాణా మార్గాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు మాత్రమే తెలిపింది. మరోవైపు, అమెరికా దాడులపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హ్యూమన్ రైట్స్ వాచ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్తో పాటు స్వతంత్ర ఐక్యరాజ్యసమితి నిపుణులు ఈ దాడులను చట్టవిరుద్ధమైన, న్యాయేతర హత్యలుగా అభివర్ణించారు.
ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం అమెరికా సైన్యం తూర్పు పసిఫిక్‌లో వారాంతంలో ఓ నౌకపై జరిపిన మరో దాడిలో ఇద్దరు మరణించినట్లు ప్రకటించింది. రెండు నెలలకు పైగా వ్యవధి తర్వాత ఆ ప్రాంతంలో జరిగిన తొలి దాడి ఇదేనని తెలిపింది.






కామెంట్‌లు (0)