- చిన్నారితో సహా నలుగురి మృతి
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణ ఇరాన్‌లోని హోర్ముజ్‌గాన్ ప్రావిన్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సిరిక్ కౌంటీలోని కుహెస్టాక్‌లో వివాహ వేడుక జరుగుతున్న ఓ ఇంటిపై అమెరికా క్షిపణి శకలాలు పడటంతో ఒక చిన్నారితో సహా నలుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. రెడ్ క్రెసెంట్ ప్రకారం, వివాహ వేడుక సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించగా, అనంతరం మృతుల సంఖ్య నాలుగుకు చేరినట్లు ధృవీకరించారు. దాడి అనంతరం ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలను ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్, జాస్క్, చబహార్ సహా పలు ప్రాంతాల్లో, జిరోఫ్ట్ పౌర విమానాశ్రయంలోనూ దాడులు జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇరాన్‌పై మరిన్ని దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, కొత్త ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సాంట్ తెలిపారు. అమెరికా చర్యలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ నుంచి ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకుంటే, ఇతర దేశాల చమురు ఎగుమతులను కూడా అనుమతించబోమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఖర్ ఘాలిబాఫ్ హెచ్చరించారు.







కామెంట్‌లు (0)