అమరావతి : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇకపై ఎపి రాష్ట్రంలోని ధర్మవరం, పుట్టపర్తి మీదుగా పరుగులు తీయనుంది. హైదరాబాద్ నుండి అమరావతి మీదుగా బెంగళూరుకు వెళ్లే బుల్లెట్ ట్రైన్ కారీడార్‌ను ఈ రెండు పట్టణాల మీదుగా నిర్మించేలా ఎలైన్‌మెంట్‌లో మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం NHRCLకు సూచించింది. ఈ మేరకు తాజాగా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో సమావేశమైన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే, డీపీఆర్ తయారీలో మార్పులు చేయాలని సూచించింది. ఈ మార్పులకు అనుగుణంగా ప్రాజెక్టు డిపిఆర్ సిద్ధం చేయాలని కోరింది. ఈ మేరకు రైల్వే బోర్డ్ ఛైర్మన్‌కు కూడా ప్రభుత్వం లేఖ రాసింది.
NHRCL మొదటి చేపట్టిన ఎలైన్‌మెంట్ ప్రకారం .... బుల్లెట్ ట్రైన్ కారిడార్ అనంతపురం - హిందూపురం మధ్య దుద్దేబండ వద్ద మాత్రమే స్టేషన్ వచ్చేది. కానీ తాజాగా ప్రభుత్వ సూచించిన విధంగా ధర్మవరం, పుట్టపర్తి మీదుగా కారిడార్‌ను నిర్మించి స్టేషన్‌లు ఏర్పాటు చేస్తే రెట్టింపు ప్రయోజనాలు కలగనున్నాయి. ఎలా అంటే దేశవిదేశాల నుంచి పుట్టపర్తి క్షేత్రానికి వచ్చే యాత్రికులు.. ఇక్కడి నుంచి సులభంగా హైదరాబాద్, బెంగళూరుకు చేరుకోవచ్చు. పుట్టపర్తి సమీపంలో ఇటీవల రక్షణ రంగానికి చెందిన యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే మరికొన్ని అనుబంధ సంస్థలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇప్పటికే సమీపంలో ఉన్న ‘కియా’ పరిశ్రమ వల్ల స్థానిక వ్యాపార రంగానికి మరింత ఊతం లభిస్తుంది. అంతేకాదు, భవిష్యత్తులో రాబోయే బుల్లెట్ రైల్ సౌకర్యంతో పుట్టపర్తి, ధర్మవరం ప్రాంతాల ప్రజల ప్రయాణ అవసరాలు తీరడమే కాకుండా, ఈ ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది.








కామెంట్‌లు (0)