బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎయిర్‌టెల్ రీ‘ఛార్జ్‌’ మరింత భారం..

1 గంట క్రితం

airtel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 12:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రూ.299 బేసిక్ ప్లాన్ ఎత్తివేత

  • ఇక కనిష్ట ప్లాన్‌ రూ.349

ముంబయి : ప్రయివేటు టెల్కోలు అడ్డగోలుగా వినియోగదారులపై భారాలను మోపుతున్నాయి. ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులపై గతేడాది టారిఫ్ ధరలను పెంచగా తాజాగా తన బేసిక్‌ ‌ప్లాన్‌ రూ.299 పూర్తిగా నిలిపివేసింది. అధికారిక వెబ్‌సైట్ అలాగే ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుంచి ఈ ప్లాన్‌ను తొలగించడంతో వినియోగదారులపై మరింత ఆర్థిక భారం పడినట్లయింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న రూ.299 ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1 జిబి డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, పెర్‌ప్లెక్సిటీ ప్రో ఎఐ సబ్‌స్క్రిప్షన్ లభించేవి. ఈ ప్లాన్ రద్దుతో ఇప్పుడు ఎయిర్‌టెల్‌లో కనీస రీఛార్జి ధర రూ.349కి చేరింది. రూ.349 ప్లాన్‌లో 28 రోజుల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 1.5 జిబి డేటా, అన్‌లిమిటెడ్ 5జి డేటాతో పాటు యాపిల్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లే ప్రయోజనాలు వర్తిస్తాయని కంపెనీ వెల్లడించింది. మరోవైపు కేవలం రూ.299 ప్లాన్ మాత్రమే కాకుండా మరికొన్ని దీర్ఘకాలిక ప్లాన్లపై కూడా ఎయిర్‌టెల్ కోత విధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సర్కిల్స్‌లో రూ.579, రూ.619 ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా తొలగించినట్లు సమాచారం. త్వరలోనే ఈ నిలిపివేత ప్రక్రియను దేశవ్యాప్తంగా ఇతర టెలికాం సర్కిళ్లకూ విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో భారతి ఎయిర్‌టెల్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన ఏకంగా 37.3 శాతం పెరిగి రూ.8,167 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 18.4 శాతం వృద్ధితో రూ.58,539 కోట్లకు పెరిగింది. సగటు వినియోగదారుడి నుంచి ఆదాయం (ఎఆర్‌‌పియు) రూ.250 నుంచి రూ.264కు పెరగడం కంపెనీ లాభాలను మరింత పెంచింది. అయినప్పటికీ వినియోగదారులపై వరుస భారాలను మోపడం గమనార్హం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్