- తిరిగి చెల్లించడంలో విఫలం
- సిబిఐ కేసు నమోదు
- పలువురిపై ఎఫ్‌ఐఆర్
న్యూఢిల్లీ : రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనీల్ అంబానీ ఇపిఎఫ్‌ఒకు వేల కోట్లు ఎగనామం పెట్టారు. రిలయన్స్ క్యాపిటల్, ఆ సంస్థ మాజీ ఛైర్మన్ అనీల్ అంబానీతో పాటు పలువురిపై రూ.1,816.22 కోట్ల ఇపిఎఫ్‌ఒ పెట్టుబడి మోసానికి సంబంధించి సిబిఐ తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2013-14లో రిలయన్స్ క్యాపిటల్ జారీ చేసిన సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్‌సిడి)లో ఇపిఎఫ్‌ఒ నాలుగు పోర్ట్‌ఫోలియో మేనేజర్ల ద్వారా రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. అయితే గడువు ముగిసిన తర్వాత వాటిని తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమైందని సిబిఐ పేర్కొంది. నిధుల మళ్లింపు, మోసపూరిత లావాదేవీల కారణంగా ఇపిఎఫ్‌ఒకు రూ.1,007.55 కోట్ల అసలు నష్టం, రూ.808.67 కోట్ల వడ్డీ భారం కలిపి మొత్తం రూ.1,816.22 కోట్ల నష్టం వాటిల్లినట్లు సిబిఐ వెల్లడించింది.
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇపిఎఫ్‌ఒ ఇచ్చిన అధికారిక రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు సిబిఐ తెలిపింది. నిందితులు కావాలనే మోసపూరిత లావాదేవీలకు పాల్పడి, నిధులను ఇతర మార్గాలకు మళ్లించడం వల్లే ఈ చెల్లింపుల్లో డిఫాల్ట్ ఏర్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రయివేటు వ్యక్తులతో సహా ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై దర్యాప్తు చేపట్టినట్లు సిబిఐ స్పష్టం చేసింది. నిధులు ఎక్కడికి మళ్లించబడ్డాయనే కోణంలో దర్యాప్తు కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రిలయన్స్ ఎడిఎ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ టెలికాం సంస్థలకు సంబంధించిన పలు కేసులను కూడా సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఆ కేసుల్లో నాలుగు చార్జిషీట్లు దాఖలు చేయడంతో పాటు ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ కేసుల దర్యాప్తు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కొనసాగుతోంది.








కామెంట్‌లు (0)