గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబంగారం అమ్మకాలకు ధరల దెబ్బ

1 గంట క్రితం

goldsales
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 04:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఆరు శాతం తగ్గిన కొనుగోళ్లు..

  • వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక

ముంబయి : బంగారం అమ్మకాలను అధిక ధరలు దెబ్బతీశాయి. దేశంలో ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ పరిమాణం పరంగా 6 శాతం క్షీణించి 131.4 టన్నులకు పడిపోయినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) తాజా నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో మొత్తం డిమాండ్ 139.7 టన్నులుగా నమోదయ్యింది. సీజనల్ డిమాండ్ మందగించడం, కస్టమ్స్ డ్యూటీ పెంపుదల అమ్మకాలను ప్రభావితం చేశాయని డబ్ల్యుజిసి తన నివేదికలో పేర్కొంది. ​మరోవైపు విలువ పరంగా పసిడి కొనుగోళ్లు 50 శాతం పెరిగి రూ.1,98,100 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.1,32,500 కోట్లుగా ఉందని డబ్ల్యుజిసి ఇండియా రీజినల్ సిఇఒ సచిన్ జైన్ తెలిపారు. అధిక ధరల పరిస్థితుల్లోనూ భారతీయులు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం సగటు ధర గతేడాది రెండో త్రైమాసికంలో 3,280.4 అమెరికన్ డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది అది 4,506.3 డాలర్లకు పెరిగింది. ఇక దేశీయంగా దిగుమతి సుంకం, జిఎస్‌‌టి మినహాయించి ఏప్రిల్-జూన్ మధ్య పది గ్రాముల సరాసరి ధర రూ.1,50,744.8గా నమోదయ్యింది. గతేడాది ఇది రూ.94,875.9గా ఉంది.

గడిచిన జూన్‌ ‌త్రైమాసికంలో అభరణాల డిమాండ్ 15 శాతం తగ్గి 75.1 టన్నులకు పడిపోయింది. గతేడాది ఇదే సమయంతో ఇది 88.8 టన్నులుగా ఉంది. బార్లు, కాయిన్ల డిమాండ్ 9 శాతం పెరిగి 50.3 టన్నులకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో నిధులు తరలిపోయినప్పటికీ భారతీయ గోల్డ్ ఈటిఎఫ్‌లోకి 4.2 ‌టన్నలు పెట్టుబడులు వచ్చాయి. అయితే దిగుమతి సుంకం పెరిగిన తర్వాత మార్కెట్లో అక్రమ రవాణా పెరిగిపోవడంపై సచిన్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పాత బంగారం రీసైక్లింగ్ 17 శాతం తగ్గి 19.2 టన్నులకు పడిపోగా, మొత్తం బంగారం దిగుమతులు 23 శాతం క్షీణించి 98.1 టన్నులకు పరిమితమయ్యాయి. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణాన్ని బట్టి చూస్తే ఈ ఏడాది మొత్తం మీద దేశంలో బంగారం డిమాండ్ 650 నుండి 750 టన్ల మధ్య ఉండొచ్చని డబ్ల్యుజిసి అంచనా వేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్