71 కుటుంబాల గ్రామంలో ఒక్కడే విద్యార్థి
వలసల వేదనకు సజీవ సాక్ష్యం చెరుకుపల్లి
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చెరకుపల్లి గ్రామానికి చెందిన ఆల్తి రాంబాబు దంపతులు జీవనోపాధి కోసం చెన్నై వెళ్లారు. గ్రామంలో ఉంటే కుటుంబ పోషణ కూడా కష్టమే కావడంతో పిల్లలను మరో ఊరిలోని ప్రైవేటు పాఠశాలలో చేర్పించాల్సి వచ్చింది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చెరకుపల్లి గ్రామానికి చెందిన గాదాపు రామునాయుడు మరడాంలో చిన్న టిఫిన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంతా అక్కడే ఉండటంతో పిల్లలు కూడా చెరుకుపల్లి పాఠశాలకు దూరమయ్యారు.
మీరు మాత్రమే కాదు. ఈదుబిల్లి సత్యరావు–సత్యవతి, ఆల్తి తిరుపతి–పార్వతి, ఆల్తి రమేష్–రోహిణి వంటి అనేక కుటుంబాలు కూడా చెన్నై బాట పట్టాయి. వీరి పిల్లల భవిష్యత్తు బంధువుల ఇళ్లలో, హాస్టళ్లలో కొనసాగుతుండగా... గ్రామ బడి మాత్రం ఖాళీ అవుతోంది. దీంతో, ప్రస్తుతం చెరకుపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక విద్యార్థి మిగిలారు. పక్కనే ఉన్న జగన్నాథపురం గ్రామం పరిస్థితి కూడా ఆందోళనకరం ఉంది. ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరే విద్యార్థులు. అంగన్‌వాడీ కేంద్రంలోనూ ఇద్దరే చిన్నారులు ఉన్నారు. ఈ గ్రామాల్లో కేవలం వృద్ధ తల్లిదండ్రులు, కాయకష్టం చేయలేనివారు మాత్రమే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇలా వలస వెళ్లిన కుటుంబాలు పిల్లలను వెంట తీసుకువెళ్లకుండా తాతమ్మల వద్ద, బంధువుల వద్ద లేదా హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. ఆర్థికంగా కొంత మెరుగైన వారు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో, చెరకుపల్లి గ్రామంలో ఒక్కరు, జగన్నాథపురం గ్రామంలో ఇద్దరు చొప్పున విద్యార్థులు మిగిలారు. ఇది కేవలం ఈ రెండు గ్రామాల కథ కాదు...
దత్తిరాజేరు మండలంలో కోరపు కొత్తవలస, కృష్ణాపురం, పాచలవలస, చింతలవలస, తాడెందొరవలస వంటి గ్రామాల్లో వలసలు అధికంగా ఉన్నాయి. ముందుగా 30 ఏళ్లు దాటిన నడివయస్కుల వారు వలస పెళ్లిపోయారు. ఆ తరువాత యువత కూడా ఉపాధి వెతుక్కుంటూ విశాఖ, హైదరాబాద్ వంటి నగరాలు, పట్టణాలకు వెళ్లిపోయింది. అలానాపాలన చూసేవారు లేక అనివార్యంగా చదువు, సంరక్షణ కోసం చిన్నారులు కూడా వెళ్లిపోయారు. ఇప్పుడు గ్రామాల్లో మిగిలింది వృద్ధులే. విద్యార్థులు తగ్గిపోవడంతో బడులు వెలవెలబోతున్నాయి. బడులు ఖాళీ కావడంతో గ్రామ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతోంది.
ఏటా తరిగిపోయిన విద్యార్థుల సంఖ్య
చెరుకుపల్లి ప్రాథమిక పాఠశాల రికార్డులు గ్రామంలో జరిగిన మార్పుకు అద్దం పడుతున్నాయి. 2022–23లో ఎనిమిది మంది, 2023–24లో తొమ్మిది మంది ఉన్న విద్యార్థుల సంఖ్య, 2024–25లో ఇద్దరికి పడిపోయింది. గత విద్యా సంవత్సరంలో ఒక్కరే మిగిలారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. 71 కుటుంబాలు ఉన్న గ్రామంలో ఒక్క విద్యార్థి మాత్రమే మిగలడం సహజంగా జరిగిన పరిణామం కాదు. విద్యార్థుల తగ్గుముఖం వెనుక అనేక కుటుంబాల వేదన, వలసల చరిత్ర దాగి ఉంది. తాళాలు వేసిన ఇళ్లు... వెలవెలబోయిన వీధులు కనిపిస్తున్నాయి. గ్రామంలోని సుమారు ఇరవై కుటుంబాలు పూర్తిగా వలస వెళ్లిపోయాయి. పండుగలు, కుటుంబ కార్యక్రమాలు మినహా ఆ ఇళ్ల గడప తొక్కేవారేలేరు. మిగిలిన ఇళ్లలోనూ యువ దంపతులు అధికంగా చెన్నైలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. నెలల తరబడి ఊరు ముఖం చూడకుండా కూలి పనుల్లోనే జీవితాన్ని గడుపుతున్నారు.
గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించాలి
చెరుకుపల్లి, జగన్నాధపురం గ్రామాల్లో ఎక్కువ మంది రైతులకు అర ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు భూములే ఉన్నాయి. సాగునీటి సౌకర్యం లేదు. వర్షాధారంపై ఆధారపడడంతో చివరకు పంట చేతికొస్తుందో లేదో కూడా నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీరంతా చిన్న, సన్నకారు రైతులు కావడంతో ఏటా చేసిన అప్పులు తీర్చుకోవాలంటే వలసపోవాల్సిందే. ఈ విధంగా తమ పిల్లలు చివరకు ఊరే వదిలి వెళ్లాల్సి వస్తోంది అంటూ ఓ వృద్ధుడు ప్రజాశక్తి ఎదుట వాపోయారు. ఈ పరిస్థితి మారాలంటే శాశ్వత సాగునీటి సౌకర్యాలు కల్పించాలి. గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు పెంచాలి. చిన్న రైతుకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. వలసలను తగ్గించే ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలి.







కామెంట్‌లు (0)