బాత్రూమ్‌లోని అద్దాలు, షవర్ గ్లాస్‌లను ప్రతిరోజూ శుభ్రం చేస్తున్నా వాటిపై తెల్లటి మరకలు పేరుకుపోతుంటాయి. ఈ మరకల కారణంగా అద్దం మసకబారిపోయి పాతదిగా కనిపిస్తుంది. ఈ మరకలకు ప్రధాన కారణం గట్టి నీరు (హార్డ్ వాటర్). ఈ నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు నీరు ఆరిపోయిన తర్వాత గాజు ఉపరితలంపై పేరుకుపోతాయి. రోజులు గడిచేకొద్దీ ఈ ఖనిజాల పొర మందంగా మారి అద్దం మెరుపును తగ్గిస్తుంది. ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని పదార్థాలతో ఈ మరకలను తొలగించవచ్చు.
క్లీనింగ్ స్ప్రే ఇలా తయారు చేసుకోవచ్చు :
ఒక స్ప్రే బాటిల్‌లో సగం వరకు శుభ్రమైన నీటిని పోయాలి. అందులో 2 నుంచి 3 చుక్కల డిష్‌వాషింగ్ లిక్విడ్ వేసి, మిగిలిన భాగాన్ని తెల్ల వెనిగర్‌తో నింపాలి. ఇప్పుడు అద్దంపై మరకలు ఉన్న చోట గోరువెచ్చని నీరు పోయాలి. తరువాత తయారు చేసిన క్లీనింగ్ స్ప్రేను మొత్తం ఉపరితలంపై చల్లి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత మరోసారి స్ప్రే చేసి స్పాంజ్ లేదా మెత్తని బ్రష్‌తో గుండ్రంగా రుద్దాలి. చివరగా గోరువెచ్చని నీటితో కడిగి, మైక్రోఫైబర్ వస్త్రంతో పూర్తిగా తుడవాలి.
మొండి మరకలను ఇలా తొలగించాలి :
అద్దాన్ని వేడి నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత క్లీనింగ్ స్ప్రేను చల్లి 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం స్పాంజ్‌తో మెల్లగా గుండ్రంగా రుద్దాలి. చివరగా గోరువెచ్చని నీటితో కడిగి పూర్తిగా ఆరబెట్టాలి. ఇదే ప్రక్రియను మరకలు పోయేంతవరకు పదే పదే చేయాలి.
ఇవి కూడా పనిచేస్తాయి..
@ గోరువెచ్చని వెనిగర్‌ను గాజుపై స్ప్రే చేసి, వెనిగర్‌లో తడిపిన పేపర్ టవల్‌ను 10 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత బేకింగ్ సోడా, నీటితో తయారు చేసిన పేస్ట్‌ను బ్రష్‌తో రుద్ది కడిగేయాలి.
@ మరకలపై తెల్లటి టూత్‌పేస్ట్‌ను పూసి 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత తడి స్పాంజ్‌తో రుద్ది శుభ్రం చేస్తే మరకలు తగ్గుతాయి.
@ సగం నిమ్మకాయను ఉప్పులో ముంచి గాజుపై గుండ్రంగా రుద్దాలి. ఆ తరువాత నీటితో కడిగి ఆరనివ్వాలి.
@ అల్యూమినియం ఫాయిల్‌ను చిన్న ఉండలా చుట్టి, క్లీనింగ్ ద్రావణం స్ప్రే చేసిన గాజుపై మెల్లగా రుద్దాలి. గాజు తడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే గీతలు పడే అవకాశం ఉంటుంది.
@ వారానికి కనీసం ఒకసారి వెనిగర్ క్లీనింగ్ స్ప్రేతో అద్దాన్ని శుభ్రం చేస్తే ఖనిజాల పొర పేరుకుపోకుండా ఉంటుంది.
మరకలు మళ్లీ రాకుండా..
స్నానం చేసిన వెంటనే షవర్ గ్లాస్ లేదా అద్దంపై ఉన్న నీటిని తుడిచివేయాలి. ప్రతిరోజూ మైక్రోఫైబర్ వస్త్రం లేదా స్క్వీజీతో గాజును శుభ్రం చేస్తే మరకలు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.







కామెంట్‌లు (0)