కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వేతనాలు పెంచడానికి మొండిగా నిరాకరిస్తున్నాయి. 2014లో మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి అత్యధిక రాష్ట్రాలలో కార్మికుల జీతభత్యాల పెరుగుదల ఏ మాత్రం లేదు. ప్రతి 5 సంవత్సరాలకు జీతాలు పెంచాలని చట్టాల్లో ఉన్నా ప్రభుత్వాలే ధిక్కరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వేతనాల కోడ్‌లో రోజుకు రూ.178 జాతీయ స్థాయి కనీస వేతనంగా నిర్ణయించి...ఉపాధి హామీ పథకంలో ఉన్న గ్యారంటీని నీరుగార్చింది. రాష్ట్ర స్థాయిలో కనీస వేతన సలహా కమిటీ 72 రంగాల్లో వేతనాలు పెంచాలి. కానీ ఒక్క రంగంలో కూడా వేతనాలు పెంచలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల తరువాత పెళ్లకూరు శ్రీనివాస రెడ్డిని ఛైర్మన్‌గా, మరో 40 మంది పదవులు రాని టిడిపి నాయకులతో కమిటీని నియమించింది. కనీస వేతనం సలహా కమిటీ టిడిపి నాయకులకు పునరావస కేంద్రంగా మారింది. వీరింత వరకు ఒక్క సమావేశం కూడా జరపలేదు. గత 50 సంవత్సరాల నుంచి ఎవరు అధికారంలో ఉన్నా జాతీయ ట్రేడ్ యూనియన్‌ల నుంచి కనీసం ఒకరినైనా సలహా కమిటీలో నియమించేవారు. టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ఈ సాంప్రదాయాన్ని ధిక్కరించాయి. రాష్ట్ర స్థాయి కనీస వేతన సలహా కమిటీ వివిధ రంగాల వేతనాలు పెంచినా ప్రభుత్వాలపై ఏ మాత్రం భారం ఉండదు. పెరిగిన వేతనాలు యాజమాన్యాలు మాత్రమే చెల్లిస్తాయి. రాష్ట్రంలోని 72 రంగాల్లో 50 లక్షల మంది కార్మికులు నెలకు రూ.12 వేల లోపు జీతంతోనే పని చేస్తున్నారు. ఫార్మా, ఆక్వా, సిమెంట్, మైనింగ్, మాల్స్, గార్మెంట్స్ లాంటి పరిశ్రమల్లో యాజమాన్యాలు రూ.వేల కోట్లు లాభాలు గడిస్తున్నాయి. కార్మికులు మాత్రం శ్రమ చేయాలి. కానీ జీతాలు మాత్రం అతి తక్కువ చెల్లించాలనే వైఖరితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడి తరువాత పెట్రోలియం ధరలు 24 శాతం, ఎరువుల ధరలు 32 శాతం పెరిగాయి. ప్రభుత్వం విద్యుత్, గ్యాస్ ధరలను అమాంతం పెంచింది. ఇంటి అద్దెలు పెరుగుతున్నాయి. మరో వైపున కార్మికుల పని గంటలు 10 నుండి 12 గంటలకు రాష్ట్ర ప్రభుత్వమే పెంచింది. కార్మికులు బతకడానికి వీలు లేని పరిస్థితులను ప్రభుత్వమే కల్పిస్తున్నది. రాష్ట్రంలో నేడు విస్తరిస్తున్న పరిశ్రమలన్నీ స్పెషల్ ఎకనమిక్ జోన్‌లలోనే వస్తున్నాయి. వీరి జీతాలు మరింత అద్వాన్నంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాలకు భూములు, నీరు, విద్యుత్ లాంటి సౌకర్యాలు కారు చౌక ధరలకే ఇస్తున్నది. ఈ జోన్ల లోని విదేశీ కంపెనీలు తమ లాభాలను విదేశాలకు తరలిస్తున్నాయి. కృష్ణపట్నం, గంగవరం పోర్టులలో అదానీ యాజమాన్యం అత్యధిక లాభాలు గడిస్తున్నా కార్మికులకు అతి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్మికులు 42 రోజుల సమ్మె పోరాటం తరువాత 2024 జూన్ నుంచి అంగన్‌వాడీ జీతాలు పెంచుతామని నాటి రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ సంఘాలతో ఒప్పందం చేసింది. కాని నేటికీ ఆ ఒప్పందం అమలు కాలేదు. అసంఘటిత కార్మికుల జీతాలు ప్రభుత్వాలు గానీ, యాజమాన్యాలు గానీ ఎప్పుడు చెల్లిస్తాయో తెలియదు. నెలల తరబడి జీతాల కోసం ఎదురు చూపులు చూడవలసి వస్తున్నది.
బానిస వ్యవస్థలో కూడా బానిసలకు వేళకు తిండి పెట్టి పని చేయించేవారు. కానీ నేడు కార్మిక వర్గం అర్ధాకలితో, పస్తులతో పని చేయవలసి వస్తున్నది. యాజమాన్యాలు భద్రతను పాటించకుండా కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. డ్యూటీకి వెళ్లిన కార్మికులు తిరిగి వస్తారనే గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడింది. అప్పులు లేని కార్మికులే కనబడరు. కార్మికుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. మరో వైపున పెట్టుబడిదారుల లాభాలు రూ.లక్షల కోట్లకు ఎగబాకుతున్నాయి. పెట్టుబడిదారులు 1991లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బైటపడడానికి ఎల్.పి.జి విధానాల ద్వారా దోపిడీని పెంచి లాభపడ్డారు.
దేశంలోని భూములు, గనులు, భారీ పరిశ్రమలు, సముద్ర తీరాన్ని స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు కారుచౌకగా కట్టబెట్టారు. పరిశ్రమల్లో గానీ, వ్యవసాయంలో గానీ పని చేసే శ్రామికవర్గం తీవ్ర దోపిడీకి గురౌతున్నారు. ప్రభుత్వాలు జీతాలు పెంచకపోవడం, ధరలు విపరీతంగా పెరగడం వల్ల శ్రామికవర్గ కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల పెట్టుబడిదారులు అన్ని రంగాల్లో ఉత్పత్తి తగ్గిస్తున్నారు. దీనివల్ల పరిశ్రమల మూసివేత, నిరుద్యోగం పెరుగుతున్నది. ఆర్థిక సంక్షోభాలకు మూలం ఇదే.
భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రజలందరికీ జీవించే హక్కును ప్రసాదించింది. దీని కోసం పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగాల్లో పనులు కల్పించి మెరుగైన జీతాలు చెల్లించాలని చెప్పబడింది. కానీ స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తరువాత ప్రాథమిక రాజ్యాంగ సూత్రాలకు విలువ లేకుండా పోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నాయి. వేతనాలు పెంచడానికి మొండిగా నిరాకరిస్తున్నాయి. దీనికి నిరసనగా ఉత్తర భారతదేశంలో నోయిడా కేంద్రంగా వేతనాల పెంపు కోసం భారీ ఉద్యమాలు సాగుతున్నాయి. జాతీయ రహదారుల దిగ్బంధానికి కూడా కార్మిక వర్గం వెనుకాడటం లేదు. ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు పెంచక తప్పలేదు. తెలంగాణ, కర్ణాటకలో కూడా వేతనాలు పెంచారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి కూటమి ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. గతంలో కూడా కార్మిక వర్గం రాష్ట్రంలో పోరాటాలు జరిపే జీతాలు పెంచుకున్నది. కార్మికుల వేతనాల పెంపునకు జులై 30, 31 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించాలి. సమరశీల పోరాటాలు నడపడమే వేతన పెంపు సమస్యకు సరైన పరిష్కారం.
- వ్యాసకర్త: సిహెచ్. నరసింగరావు,
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి







కామెంట్‌లు (0)