మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎల్‌‌నినో భయాలు

1 గంట క్రితం

ei nino
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 05:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఈ ఏడాది ఎల్‌‌నినో భయాలు క్రమంగా ఆవరిస్తున్నాయి. జూన్‌‌లో తక్కువ స్థాయిలో మొదలైన ఎల్‌‌నినో ప్రభావం జూలై- సెప్టెంబర్‌ ‌మధ్య బలపడి తీవ్రరూపం దాల్చి శీతాకాలం వరకు కొనసాగుతుందని ఐక్య రాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఒ) తాజా ప్రకటన ఆందోళనలను ఇంకా ఎక్కువ చేసింది. ఎల్‌‌నినో తీవ్ర ప్రభావిత ప్రాంతాలను రెడ్‌ ‌జోన్లుగా గుర్తించి అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. భారత దేశంలో 724 జిల్లాలుండగా 111 డేంజర్‌ (‌రెడ్‌) ‌జిల్లాల జాబితా విడుదల చేయగా వాటిలో మన రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలు ఉండటం మిక్కిలి ఆందోళన కలిగించే విషయం. సాగునీటి వసతి 25 శాతం లోపు కలిగిన జిల్లాలను ‘ప్రమాద’ ప్రాంతాలుగా పేర్కొన్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న ఎల్‌‌నినో కోరలు ఆంధ్రప్రదేశ్‌నూ చేరతాయని కొన్ని నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అంత తీవ్రత ఖరీఫ్‌ మొదట్లో తొలకరి సమయంలో ఉండకపోవచ్చని ధీమాకు పోయింది. నైరుతి రుతుపవనాలు ఊహించినదానికంటే ఐదారు రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తొలుత వర్షాలు మురిపించి ఆపై ముఖం చాటేశాయి. జూన్‌‌ సాధారణ వర్షపాతంలో 63 శాతం తక్కువ నమోదైంది. ఏ జిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. జూన్‌‌లో అసాధారణ ఉష్ణోగ్రతలతో ప్రజలు ఏ విధంగా అల్లాడారో చూశాం. ఆదిలోనే తీవ్ర వర్షాభావం నెలకొని రాబోయే కాలానికి ఎల్‌‌నినో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అంతగా లెక్కలోకి రావని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాతావరణ సరళిలో అసాధారణ మార్పులను ఎల్‌‌నినోగా పేర్కొంటుండగా, మధ్య, తూర్పు పసిఫిక్‌ ‌మహా సముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం ద్వారా ఎల్‌‌నినో ఏర్పడుతుంది. ప్రతి రెండు నుంచి ఏడేళ్లకో మారు ఎల్‌‌నినో వస్తుంది. వరదలు, కరువు, తుపాన్లు, వడగాలులను తీసుకొస్తుంది. ఆహారోత్పత్తి, నీరు, ఆరోగ్య వ్యవస్థ, ప్రజల మౌలిక వసతులపై ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది. పసిఫిక్‌ ‌ఖండంపైనే కాదు అన్ని ఖాండాలపైనా, వాటిల్లోని అన్ని దేశాలు, ప్రాంతాలపైనా ఎల్‌‌నినో ప్రభావం తథ్యం. భారతదేశం విషయానికొస్తే 2002లో వచ్చిన ఎల్‌‌నినో అత్యధిక నష్టం కలిగించిందని చెబుతారు. ఆ ఏడాది సగటు సాధారణ వర్షపాతంలో 39 శాతం పైన తక్కువ నమోదైంది. 2014, 2018, 2023 సంవత్సరాల్లోనూ మన దేశంపై, మన రాష్ట్రంపై దాడి చేసింది.

ఎల్‌‌నినో దూసిన కత్తికి ప్రధానంగా బలయ్యేది వ్యవసాయ రంగం, దానిపై ఆధారపడ్డ రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు. వాతావరణ శాఖ హెచ్చరికలుబట్టి ఖరీఫ్‌ మధ్యలో ఎల్‌‌నినో బలపడి సంవత్సరమంతా తిష్టవేస్తుంది. ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లలోనూ ప్రభావం కొనసాగుతుంది. వచ్చే ఏట వేసవి అసాధారణ ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో చాలా హాట్‌‌గా ఉంటుందనీ చెబుతున్నారు. కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాజెక్టులకు కృష్ణా నదీ ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసే వర్షాలే ఆధారం. ప్రస్తుతం అక్కడ సరైన వానల్లేవు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు. జూలైలో 40 శాతం వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ నెల ప్రారంభంలో అంచనా వేసింది. ఆ తర్వాత కూడా వర్షాలకు గ్యారంటీ లేదు. వ్యవసాయ రాష్ట్రంలో సేద్యం దెబ్బతింటే ఒక్క రైతులకే కాదు అన్ని వర్గాలకు, చివరికి ప్రభుత్వానికీ నష్టం. సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి సరైన ముందు చూపు, సమగ్ర ప్రణాళిక ఉండాలి. ప్రత్యామ్నాయ పంటల సాగు, పశువులకు తాగునీరు, గ్రాసం, వ్యవసాయ కార్మికులకు ఉపాధి, సాగు, తాగునీరు అత్యవసరం అవుతాయి. వచ్చేది సాధారణ కరువు కాదు ఆకస్మిక కరువుగా చెబుతున్నారు. ఆ దృష్టితో ప్రభుత్వం చర్యలకు సమాయత్తం కావాలి. రెడ్‌ ‌జాబితాలోని జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎల్‌‌నినోను ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించి ప్రత్యేక నిధులిచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కరోనాలో మాదిరి ‘యాక్ట్‌ ఆఫ్‌ ‌గాడ్‌‌’ పేరిట కేంద్రం చేతులెత్తేసే ప్రమాదం ఉన్నందున అప్రమత్తత వహించాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్