- మహానది గోదావరి లింకుపై దశాబ్దాలుగా చర్చలు
- 2019లో రూ.54019 కోట్లతో ప్రతిపాదనలు
- నేటికి రూ.83 వేల కోట్ల అంచనా
- ఇప్పటికే అభ్యంతరపెట్టిన ఒడిస్సా
- ఇప్పుడు శ్రీకాకుళం మీదుగా పోలవరానికి లింకు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నదుల అనుసంధానం అంశంలో మహానది, గోదావరి(పోలవరం) లింకు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ముందుకు తీసుకొచ్చింది. గతంలో మహానది ఇచ్చంపల్లి వరకూ లింకు చేయాలని అనుకున్నా దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మహానది నుండి పోలవరం ప్రాజెక్టుకు లింకు చేసే అంశం చర్చనీయాంశం ముందుకు వచ్చింది. 2024లోనే దీనిపై నివేదికలు తయారు చేశారు, 2019లో ఈ ప్రాజెక్టు కోసం రూ.54019 కోట్లు ఖర్చవుతుందని అంచనా రూపొందించారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన జాతీయ నీటి అభివృద్ధి ఏజెన్సీ సమావేశంలో దీనిపై చర్చించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం రూ.83 వేల కోట్ల వరకూ ఖనర్చవుతుందని తెలిపారు. హిమాలయాల నుండి పెన్నా, కావేరికి నీటిని అనుసంధానం చేసే ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మహానది, గోదావరి లింకు ప్రాజెక్టులో భాగంగా పోలవరాన్ని లింకు ప్రతిపాదనలు వచ్చాయి. అక్కడ నుండి కృష్ణానదికి, కృష్ణానది పైభాగంలో శ్రీశైలం నుండి పెన్నానదికి నీటిని తరలించే విధంగా ప్లాను రూపొందించారు. దీనిపై కేంద్రస్థాయిలో అనేక సార్లు చర్చలు జరిగాయి. మహానది, గోదావరి లింకు ప్రాజెక్టు తొలిసారి 2012లోనే ఆమోదం పొందింది. అక్కడ నుండి కొనసాగుతూ వస్తోంది. గతేడాది జరిగిన సమావేశంలో ఇచ్ఛంపల్లి నుండి నాగార్జునసాగర్ వరకూ తమ భూభాగంలో నుండి నీరు వెళితే అభ్యంతరం లేదని, కానీ 50 శాతం వాటా ఇవ్వాలని తెలంగాణా అధికారులు కోరారు. మిగులు జలాల విషయంలో తమకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎపి అధికారులు కోరారు. అయితే పోలవరం నుండి నీటిని కృష్ణానదికి తీసుకెళ్లే అంశాన్ని రాష్ట్ర అధికారులు ప్రతిపాదించారు. దీనికోసం ఒడిస్సా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ మీదుగా పోలవరం వరకూ నీటిని తీసుకురావాలని నిర్ణయించారు. వాస్తవంగా 2019లోనే దీనికి కేంద్ర నదుల అనుసంధాన ప్రాజెక్టు కమిటీ ఆమోదం వచ్చింది. అప్పటి నుండి కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముందుగా భవనాల నిర్మాణానికి 2019లో రూ.257 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
మహానది, గోదావరినది లింకు కాలువ వెళ్లే ప్రాంతాలు
లింకు కెనాల్ ఒడిస్సాలో భువనేశ్వర్, గనియా, నయాగడ్, ఖుర్దా, రాజ్‌సుఖలానా, బాన్‌పూర్, బాలుగావ్, తంగి, గజపతి, అస్కా, దిగపహాండి, పొలాసరా, గంజాం, బెర్హంపూర్ వైపుగా వస్తుంది. ఎపిలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సోంపేట, మందస, పలాస, ఇచ్చాపురం, టెక్కలి, సావరకోట, శ్రీకాకుళం, హీరమండలం, పొందూరులోనూ, ఉమ్మడి విజయనగరం జిల్లా చీపురుపల్లి, రణస్థలం, డెంకాడ, విజయనగరం మీదుగా నీటి మళ్లింపు చేపట్టాలని నిర్ణయించి అందుకోసం ఆయా ప్రాంతాల్లోనూ కెనాల్ వెళ్లనుంది. వీటితోపాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖపట్నం, పెందుర్తి, పరవాడ, అనాకపల్లి, యలమంచిలి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తుని, అన్నవరం, పెద్దాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం మీదుగా పోలవరం వద్దకు కాలువ నిర్మాణం చేపట్టనున్నారు. నిర్వహణ భవనాలు నిర్మించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీనికోసం కెనాల్ వెళ్లే మండల కేంద్రాల్లో భవనాలు నిర్మించాలని ప్రతిపానదలు కూడా సిద్దం చేశారు. ఇది అమల్లోకి వస్తే మంచిదేనని జలవనరులశాఖ నిపుణులు చెబుతున్నారు. వాస్తవంగా ఉన్న ప్రాజెక్టులనే పూర్తి చేయలేని ప్రభుత్వం కొత్తగా చేసేది ఏమి ఉంటుందనేది కూడా వారి ప్రశ్నగా ఉంది. వాస్తవంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సిద్ధపడని రాష్ట్ర ప్రభుత్వం మహానది నుండి నీటిని తీసుకురావడం ద్వారా ఉత్తరాంధ్రకు నీటిని అందిస్తామనే ఆశలు కల్పించడం తప్ప ఉపయోగం లేదనీ చెబుతున్నారు.
ఒడిస్సా అభ్యంతరం
మహానది నుండి గోదావరి లింకు ప్రాజెక్టుపై నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీలో ఒడిస్సా అభ్యంతరం పెట్టింది. అక్కడ నీటి లభ్యత తగ్గుతోందని, ప్రవాహకాలం కూడా తక్కుగా ఉందని, ఇటువంటి సమయంలో మహానది నుండి నీటిని తీసుకుపోవడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.







కామెంట్‌లు (0)