మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అందుబాటు ఆహారంలోనే పోషకాల ఖజానా

1 గంట క్రితం

food
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 05:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఈ మధ్యకాలంలో ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. ఏది తినాలి? ఏది తినకూడదు? ఏ ఆహారం వల్ల బరువు తగ్గుతుంది? ఏది రోగనిరోధక శక్తిని పెంచుతుంది? వంటి విషయాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో "సూపర్ ఫుడ్" అనే పదం కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చియా గింజలు, క్వినోవా, అవకాడో, బ్లూబెర్రీలు, గ్రానోలా... ఇవన్నీ ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రచారం పొందుతున్నాయి. సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలు, ప్రకటనలు, ఫిట్‌నెస్ సలహాలతో ఈ ఆహారాలపై ఆసక్తి పెరిగింది. దీంతో ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఖరీదైన ఆహారాలనే తప్పనిసరిగా తినాలనే అభిప్రాయం కూడా చాలామందిలో ఏర్పడుతోంది. అయితే పోషకాహార నిపుణులు మాత్రం దీనిని పూర్తిగా సమర్థించడం లేదు. శరీరానికి అవసరమైన పోషకాలు అందడం ముఖ్యమని, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది అంత ముఖ్యమైన విషయం కాదని చెబుతున్నారు. మనకు అందుబాటులో, తక్కువ ధరకే లభించే అనేక ఆహారాల్లో కూడా అదే స్థాయి పోషక విలువలు ఉన్నాయని వివరిస్తున్నారు.

​సూపర్ ఫుడ్స్​ అంటే ...

వాస్తవానికి "సూపర్ ఫుడ్" అనే పదానికి శాస్త్రీయ నిర్వచనం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), భారత వైద్య పరిశోధన మండలి (ICMR), జాతీయ పోషకాహార సంస్థ (NIN) వంటి సంస్థలు ఈ పదాన్ని అధికారికంగా ఉపయోగించవు. ఇది ప్రధానంగా ఆహార పరిశ్రమ, మార్కెటింగ్ రంగంలో ప్రచారానికి ఉపయోగించే పదం. ఏదైనా ఆహారంలో ఒకటి లేదా రెండు పోషకాలు ఎక్కువగా ఉంటే దానిని "సూపర్ ఫుడ్"గా ప్రచారం చేస్తారు. కానీ ఆరోగ్యం ఒక్క ఆహార పదార్థంతో రాదు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజ లవణాలు, తగినంత నీరు, క్రమమైన వ్యాయామం, సరిపడా నిద్ర... ఇవన్నీ కలిసి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. అందుకే ఏ ఒక్క ఆహారాన్నీ అద్భుత ఔషధంలా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

​మన ప్రత్యామ్నాయాలు​

ఎంతో ప్రచారం పొందుతున్న విదేశీ ఆహారాల్లో ఉండే పోషకాలకు మనకు సులభంగా దొరికే ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు క్వినోవాను అధిక ప్రోటీన్‌, పీచు పదార్థం కలిగిన ధాన్యంగా ప్రచారం చేస్తారు. అయితే కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాల్లో కూడా మంచి మోతాదులో ప్రోటీన్లు, పీచు పదార్థం, బి-విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. చియా గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. అదే ఒమేగా-3 మన దగ్గర సులభంగా దొరికే అవిసె గింజల్లో కూడా సమృద్ధిగా ఉంటుంది. నువ్వులు కాల్షియం, ఇనుము, మంచి కొవ్వులకు నిలయం. వేరుశెనగల్లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్-ఇ లభిస్తాయి.

​అవకాడోలో మంచి కొవ్వులు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అయితే వేరుశెనగలు, బాదం, జీడిపప్పు, కొబ్బరి కూడా ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. పొటాషియం విషయానికి వస్తే అరటిపండు, బొప్పాయి, జామపండు కూడా మంచి వనరులే. బ్లూబెర్రీలను యాంటీఆక్సిడెంట్ల కోసం ఎక్కువగా తింటారు. మన దగ్గర లభించే ఉసిరికాయ, నేరేడు, దానిమ్మ, నల్ల ద్రాక్షల్లో కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఉసిరికాయలో విటమిన్-సి మోతాదు చాలా ఎక్కువ. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన కేల్ ఆకుకూరలో విటమిన్-ఎ, కాల్షియం, ఇనుము ఎక్కువగా ఉంటాయి. అదే పోషకాలు మన మునగాకు, పాలకూర, తోటకూర, బచ్చలికూరల్లో సమృద్ధిగా లభిస్తాయి. అందుకే పోషకాహారం కోసం విదేశీ పదార్థాలపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

​ఆరోగ్య సూత్రం​

ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధన మండలి, జాతీయ పోషకాహార సంస్థలు ఒకే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. రోజూ వివిధ రకాల ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు సమతులంగా తీసుకోవాలి. ఒకే రకమైన ఆహారంపై ఆధారపడకూడదు. మన రోజువారీ భోజనాన్ని గమనిస్తే ఒక సమతుల పోషకాహార నమూనా కనిపిస్తుంది. అన్నం, పప్పు, ఒక కూర, ఒక ఆకుకూర, పెరుగు లేదా మజ్జిగ, కాలానుగుణంగా ఒక పండు - ఈ కలయికలో శరీరానికి అవసరమైన చాలా పోషకాలు లభిస్తాయి. ఇదే ఆధునిక పోషకాహార శాస్త్రం సూచిస్తున్న "సమతుల ఆహారం". అందుకే ఆహారంలో వైవిధ్యం ఉండాలి కానీ, ఆ వైవిధ్యం ఖరీదైన దిగుమతి ఆహారాలతోనే రావాలనే నియమం లేదు. పోషకాహారం అనేది ధరతో నిర్ణయించబడదు. శరీరానికి అవసరమైన పోషకాలు సమతులంగా అందుతున్నాయా లేదా అన్నదే అసలు ప్రమాణం. అందుకే ఆహారం ఎంపికలో ప్రకటనల కంటే శాస్త్రీయ అవగాహనకు ప్రాధాన్యం ఇస్తే - ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఖర్చు కూడా అదుపులో ఉంటుంది.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్