బెంబెలెత్తిస్తున్న చమురు సెగలు
సెన్సెక్స్ మరో 326 పాయింట్లు పతనం
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగిసినప్పటికీ దౌత్యపరమైన పరిష్కారం లభించకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడం దలాల్ స్ట్రీట్‌ను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో దేశీయ సూచీలు బుధవారం కూడా తీవ్ర నష్టాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ వరుసగా నాలుగో రోజు క్షీణించగా, ఎన్ఎస్ఇ నిఫ్టీ వరుసగా ఏడో రోజూ పతనాన్ని చవి చూసింది. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 325.78 పాయింట్లు లేదా 0.42 శాతం నష్టపోయి 76,909.68కు పరిమితమయ్యింది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో ఇది 412.57 పాయింట్లు పడిపోయి 76,822.89 కనిష్ట స్థాయికి చేరింది. కాగా.. గత నాలుగు రోజుల్లోనే సెన్సెక్స్ ఏకంగా 1,170.28 పాయింట్లు లేదా 1.49 శాతం కోల్పోయింది. మరోవైపు, 50 షేర్ల ఎన్ఎస్ఇ నిఫ్టీ 76.60 పాయింట్లు లేదా 0.32 శాతం పడిపోయి 24,078.30 వద్ద ముగిసింది. గత ఏడు సెషన్లలో నిఫ్టీ ఏకంగా 505.5 పాయింట్లు లేదా 2 శాతం పతనమవ్వడం ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
సెన్సెక్స్-30లో పవర్ గ్రిడ్, బాజాజ్ ఫైనాన్స్, లార్సన్ అండ్ టూబ్రో, ఐటిసి, హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధానంగా నష్టపోగా.. హెచ్‌సిఎల్ టెక్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. బిఎస్ఇ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.73 శాతం పడిపోయింది. రంగాలవారీగా పవర్ (1.69 శాతం), క్యాపిటల్ గూడ్స్ (1.59 శాతం), యుటిలిటీస్ (1.25 శాతం) రంగాలు నష్టాలను చవి చూశాయి.







కామెంట్‌లు (0)