ఎండిఆర్‌కు మొబైల్ రిటైలర్ల నిరసన
న్యూఢిల్లీ: యుపిఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే పెట్రోల్ బంక్ యాజమానులు, ఢిల్లీ, సూరత్‌లో వర్తకులు ఈ ఛార్జీలను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా యుపిఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్)ను ఉపసంహరించుకోవాలని అఖిల భారత మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఎఐఎంఆర్‌ఎ) అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘నో యుపిఐ డే’ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నిరసనలో భాగంగా రిటైలర్లు తమ యుపిఐ క్యూఆర్ కోడ్‌లపై నల్ల గుడ్డలు కప్పి నిరసన తెలపనున్నారు. ‘ఒకే దేశం, ఒకే వ్యాపార వర్గం, ఒకే గొంతుక’ నినాదంతో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపింది. రూ.2,000కు మించిన యుపిఐ చెల్లింపులపై ప్రతిపాదించిన 0.4 శాతం ఎండిఆర్ చిన్న వ్యాపారుల లాభాల మార్జిన్లపై అదనపు భారాన్ని మోపుతుందని సంఘం పేర్కొంది. ఎండిఆర్ చార్జీలను ఉపసంహరించుకోవాలని విధాన రూపకర్తలు, ఆర్థిక సంస్థలు, ఎన్‌పిసిఐలను ఎఐఎంఆర్‌ఎ డిమాండ్ చేసింది. ఎంఎస్‌ఎంఇలు, దుకాణదారులు, స్వతంత్ర రిటైలర్లు తక్కువ మార్జిన్లతో వ్యాపారం చేస్తున్నందున డిజిటల్ చెల్లింపులపై అదనపు ఛార్జీలు విధించడం వారికి భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ చెల్లింపుల విస్తరణకు మద్దతు ఇస్తూనే.. వ్యాపారులకు యుపిఐ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది.







కామెంట్‌లు (0)