ప్రజాశక్తి -కపిలేశ్వరపురం : తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన కపిలేశ్వరపురంలోని రాజానగరం జీఎస్‌ఎల్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్మించిన సూర్య చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్‌ను సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన అత్యాధునిక వైద్య పరికరాలు, వసతి సౌకర్యాలు, వైద్య సేవలను, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు. వైద్య సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం సమాజంలో క్యాన్సర్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుందన్నారు. చిన్నపాటి పరీక్షతో దానిని ప్రారంభ దశలో గుర్తించడం వల్ల నివారించే అవకాశం ఉందన్నారు. దీనికోసం ప్రతి మహిళ బ్రస్ట్ క్యాన్సర్ కోసం పరీక్ష చేయించుకోవాలని సూచించారు. తాను తన కుటుంబం ఆచరించిన విషయాలనే చెబుతున్నానంటూ ఆయన వివరించారు. ప్లాస్టిక్ వాడటం మానవాళికి పెనుముప్పుగా మారిందన్నారు. ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగితే దానిలో ఉండే మైక్రో ప్లాస్టిక్ రక్తంలో కలిసిపోతుందని దీనివల్ల ఊపిరితిత్తులు కాలేయం, వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎం.మురళీమోహన్, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ఏఐజి ఆసుపత్రి చైర్మన్ డి నాగేశ్వర రెడ్డి, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ గన్ని భాస్కరరావు, సూర్య చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ జివిపి చౌదరి, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. వి గుజనాద్, సూపరిండెంట్ డా. సోమనాథ్ దాస్, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)