మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం నేత అప్పలరాజుపై గృహ నిర్బంధాన్ని ఎత్తివేయాలి

2 గంటల క్రితం

anakapalli CPM
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 03:53 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి : సిపిఎం డిమాండ్‌

  • ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న పోలీసుల చర్యలను ఖండించండి.

ప్రజాశక్తి అనకాపల్లి : ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా ప్రతిపాదించిన గ్రీన్‌పీల్డ్ క్యాప్టివ్ పోర్టు ప్రాంతంలో సీపీఎం బృందం పర్యటించిన వెంటనే, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. అప్పలరాజును పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి జీవనోపాధి పరిరక్షణ కోసం పోరాడటం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యతని, అలాంటి హక్కులను పోలీసుల ద్వారా అడ్డుకోవడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావులతో పాటు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు వి.వి. శ్రీనివాసరావులు పాల్గొన్నారు. అక్టోబర్ 15న జరగనున్న మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలుసుకోవడం తప్ప, పోలీసుల నిర్బంధాల మధ్య తంతుగా నిర్వహించడం కాదని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజలు తమ అభ్యంతరాలను వెల్లడించకుండా అడ్డుకోవడం, ప్రజల పక్షాన నిలిచే నాయకులను గృహనిర్బంధంలో ఉంచడం రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక హక్కులకు విరుద్ధమన్నారు. గతంలో నాతవరం ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కూడా గిరిజన గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టి ప్రజలను అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రజల గొంతును వినాల్సిన పాలకులు, ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం సరికాదని, అనకాపల్లి జిల్లాలో ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

మిట్టల్ పోర్టు నిర్మాణంతో సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల ఉపాధికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టుకు సంబంధించిన పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక ఇఐఎ లోపాలున్నాయని, ప్రభావిత గ్రామాల వాస్తవ పరిస్థితులు, మత్స్యకారుల జీవనోపాధి సమస్యలు సమగ్రంగా ప్రతిబింబించేలా నివేదికను సరిచేసి ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. అప్పలరాజుపై విధించిన గృహనిర్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలని, అక్టోబర్ 15న జరగనున్న మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయకుండా నిర్వహిస్తే ఆంక్షలు లేకుండా సిపిఎం నాయకులను, ప్రజలను స్వచ్చందంగా తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్