విజయవాడ : గత రెండేళ్లలో విజయవాడలో డయేరియాతో 15 మంది మృతి చెందారని, వందలాదిమంది ఆసుపత్రి పాలయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు అన్నారు. శుక్రవారం గిరిపురంలో పర్యటించిన బాబురావు అక్కడి రోగులను పరామర్శించారు.
ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ .... విజయవాడ గిరిపురంలో అతిసార విజృంభించి వారం రోజులు గడిచినా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వము, వైద్యారోగ్య శాఖ, నగరపాలక సంస్థ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. దళితులు, పేదలు అత్యధికంగా నివసించే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు, నిర్లక్ష్యానికి గురవుతున్నదని అసహనాన్ని వ్యక్తం చేశారు. కలుషిత నీరు సరఫరా అవుతున్నదని, పారిశుధ్యం పరిస్థితి దిగజారుతున్నదని ఫిర్యాదులు చేసినప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. గత రెండేళ్లలో మొగల్రాజపురం, న్యూ రాజరాజేశ్వరి పేట తదితర ప్రాంతాల్లో అతిసార, జి.ఈ. తో 15 మందికి పైగా మృతి చెందారనీ, వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఇప్పటికీ కారణాలు నిర్ధారించ లేదని, చర్యలు లేవు అని చెప్పారు. విజయవాడ నగరాభివృద్ధిని పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నా, వైద్య, ఆరోగ్య , ఆసుపత్రుల పరిస్థితులపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు అని మండిపడ్డారు. ఇంటి పన్నుల పెంపు, మంచినీటి మీటర్ల బిగింపు, అడ్డగోలుగా నీటి చార్జీల పెంపు వంటి అంశాలపైనే ప్రభుత్వం, నగరపాలక సంస్థ దృష్టి పెట్టిందన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికపై అతిసార అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వం చెల్లించాలని కోరారు. ఇప్పటికీ వైద్యం పొందుతున్న వారి ఖర్చు మొత్తం ప్రభుత్వం భరించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. నీటి కాలుష్యాన్ని అరికట్టాలని, పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరచాలని చెప్పారు. ఎస్సీ సబ్ ప్లాన్ తదితర నిధులను కేటాయించి గిరిపురం తదితర దళిత కాలనీలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్నారు. నగరంలో గతంలోనూ, నేడు అతిసార, జి ఈ తదితర అనారోగ్య పరిస్థితులపై సమగ్రమైన విచారణ జరిపించి, బాధ్యులను గుర్తించాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ,భవిష్యత్తులో ఈ స్థితి రాకుండా నిర్దిష్ట చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు వస్తున్న ఈ సమయంలో ప్రజారోగ్యంపై మరింత దృష్టి అవసరం అని చెప్పారు. గిరిపురంలోనే కాకుండా నగరం మొత్తం మీద స్వచ్ఛమైన మంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని, నీటి కాలుష్యాన్ని అరికట్టాలని, సిబ్బంది సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ నినాదాలు, సభలు పెట్టి, ఆర్భాటం కాకుండా, క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరచడంపై ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి , మంత్రులు, ప్రజాప్రతినిధులు మురికివాడలు, దళితులు, బలహీన వర్గాల అత్యధికంగా నివసిస్తున్న ఇలాంటి ప్రాంతాల్లో పర్యటించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో బాబురావుతోపాటు సిపిఎం నేత మాజీ కార్పొరేటర్ కాజా సరోజ, నేతలు వై సుబ్బారావు, కే. గురుమూర్తి పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)