మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ఎన్‌టిఆర్ భరోసా పింఛనుదారులకు గతంలో ప్రకటించినట్టుగా సవరించిన వేళలతో సంబంధం లేకుండా, ఎప్పటిలాగే అక్టోబరు ఒకటో తేదీ ఉదయం 6:30 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు తమ సమ్మెను విరమించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే పింఛన్ల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు మంత్రి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అక్టోబరు నెలకు గానూ ప్రభుత్వం ఇప్పటికే రూ.2,692.34 కోట్లను విడుదల చేసిందని, ఇందులో రూ.2,692.28 కోట్లను పంచాయతీ, వార్డు అధికారుల ఖాతాలకు జమ చేయగా, రూ.6 లక్షలను గజపతినగరం మండలంలోని ఎన్‌ఎస్‌ఎపి పింఛనుదారుల ఖాతాలకు డిబిటి విధానంలో జమ చేస్తారని పేర్కొన్నారు. ఈ నెల 30 నాటికి అవసరమైన నగదు సిద్ధంగా ఉండేలా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు, ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్‌ఎల్‌బిసి, బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.








కామెంట్‌లు (0)