కారుమంచి కాలువ పునరుద్ధీకరణ ప్రారంభం
ప్రజాశక్తి - చీమకుర్తి (ప్రకాశం జిల్లా) : పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సోమవారం చీమకుర్తి మండలంలోని కారుమంచి కాలువ పునరుద్ధీకరణ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సాగర్ దిగువ ప్రాంత 16 వేల ఎకరాలకు సాగునీరు, 16 గ్రామాలకు తాగునీరు అందించడంలో కారుమంచి కాలువ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాలువ పునర్నిర్మాణానికి రూ.2.63 కోట్ల నిధులు కేటాయించిందని, ఎన్నారై నల్లూరి వెంకట శేషయ్య పి ఫోర్ కార్యక్రమం కింద తమ సొంత నిధులు దాదాపు రూ.25 లక్షలకు పైగా ఖర్చు చేసి కాలువ పునరుద్ధరణ చేశారని వివరించారు. ప్రవాస భారతీయులు రైతుబిడ్డగా పేరొందిన నల్లూరి వెంకట శేషయ్య తమ సొంత గ్రామాన్ని కన్నతల్లిగా భావించి కారుమంచి కాలువను పునరుద్ధరించటంలో కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. ముందుగా మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యేలు బిఎన్.విజయ్ కుమార్, దామచర్ల జనార్ధన్‌లు కారుమంచి కాలువలో జలహారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. వారికి రైతులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రముఖ ఎన్నారై టి.రమేష్, చీమకుర్తి వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మాజీ చైర్మన్ కాట్రగడ్డ రమణయ్య, రైతులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)