ప్రొఫెసర్ సి.కాసీం
ముగిసిన సాంస్కృతికోత్సవాలు
ప్రజాశక్తి - విజయవాడ : తెలుగు అక్షరం ఉన్నంత వరకూ మహాకవి జాషువా చిరంజీవే... సుకవి జీవించు ప్రజల నాల్కలయందు జాషువా ఆయన పద్య పంక్తి ఆయన జీవితానికీ ప్రతిభా పాటవాలకూ అచ్చుగుద్దినట్టు సరిపోలుతుంది.. తెలుగు నేల మీద జాషువా అరుదైన కవి.. అపురూపమైన కవి అని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి.కాసీం కొనియాడారు. జాషువా సాంస్కృతిక వేదిక (జెఎస్‌వి) ఆధ్వర్యంలో ఈ నెల 21 నుండి 28 వరకూ (గురజాడ జయంతి నుండి జాషువా జయంతి వరకు) జరిగిన ‘జాషువా’ పదో సాంస్కృతికోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె)లో ‘జాషువా’ స్మారకోపన్యాసాన్ని ప్రొఫెసర్ సి.కాసీం చేశారు. జాషువా 131వ జయంతి కార్యక్రమానికి ప్రముఖ యువకవి, జెఎస్‌వి బాధ్యులు డ్యానీ అధ్యక్షత వహించారు. కాసీం ప్రసంగిస్తూ తెలుగు సాహిత్యానికి సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందని, ఆదికవి నన్నయ్య కాలం నుంచి లెక్కేసుకున్నా కూడా గత వెయ్యేళ్ల లిఖిత సాహిత్యంలో జాషువాకు కచ్చితంగా ఓ విశిష్ట స్థానముందని వివరించారు. అణగారిన.. బడుగు బలహీన వర్గాల నుంచి.. పంచమ కులం నుంచి వచ్చిన తాను సైతం కవిత్వం సృష్టించగలనని నిరూపించుకోవడానికి జాషువా ప్రత్యామ్నాయ రచనా విధానాన్ని ఎంచుకుని అన్ని తరగతుల నుంచీ అద్భుత ప్రశంసలందుకున్నారని గుర్తుచేశారు. తాను రచనకు ఉపక్రమించేనాటి పరిస్థితుల్లో.. వస్తువుకు సంబంధించి అంటరాని పెనుమంటల్ని.. నాలుగు పడగల హైందవ నాగరాజు ఛీత్కారాల్ని.. అవమానాల్ని స్వయంగా అనుభవించిన వ్యక్తిగా కుల అసమానతల అంశాన్ని ప్రత్యేకంగా తీసుకున్నారని తెలిపారు. కుల రక్కసి నేడూ వెంటబడి తరుముతోందన్నారు. సాహిత్యం- మనుషుల కోసం.. దుఃఖ నివారణ కోసం.. జన జాగృతికి దోహదపడాలని బలంగా విశ్వసించి.. అందుకే జాషువా కలం పట్టారని పేర్కొన్నారు. తెలుగును సైతం ఆంగ్లంలో రాస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొన్నాళ్లకు మన మాతృభాష మాయమవుతుందేమోనని, తెలుగు లిపి అంతరిస్తుందేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. జాషువాను నేటి తరం.. మరీ ముఖ్యంగా విద్యార్థి లోకం ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి రాజీవ్.. తొలుత జాషువా పద్యాలను భావయుక్తంగా చదివి అర్థాల్ని వివరించారు. తొలుత సభకు స్వాగతం పలికిన లయోలా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.టి.పార్కర్- అనంతరం ‘జెన్- జి గబ్బిలం’ కవిత చదివారు. జెఎస్‌వి ప్రధాన కార్యదర్శి ఐజాక్ న్యూటన్, ‘రైల్వే మిత్ర’ అనపర్తి గుప్తా వేదికనలంకరించారు. కాసీంను ఎంబివికె కార్యదర్శి పి.మురళీకృష్ణ సన్మానించారు. ముందుగా జాషువా చిత్రపటానికి ప్రొ.కాసీం తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. సభకు ముందు సిద్ధార్థ విద్యార్థులు ప్రదర్శించిన ‘ఇండియా’ వీధి నాటికను ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో ప్రశంసించారు.








కామెంట్‌లు (0)