చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా
ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్ : సుప్రీం కోర్టు తీర్పు మేరకు కనీస వేతనాలు అమలు, అంగన్వాడీలకు ఇబ్బందిగా మారిన నవచేతన్ యాప్ రద్దు, ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని కోరుతూ ... ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపుమేరకు శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో అంగన్వాడీలు తరలివచ్చారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లలిత, షకీలా మాట్లాడుతూ ... అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్న ఏమాత్రం పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వ తీరు ఏరు దాటేంతవరకు ఏటి మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. కనీస వేతనాలు ఈఎస్ఐ, పిఎఫ్ సాధన కోసం పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర గుప్తా, అంగన్వాడీ యూనియన్ నాయకులు మమత, సృజిని లతోపాటు జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు చెందిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు అంగన్వాడీలు, సహాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)