మహారాష్ట్రలో పాఠ్యాంశంగా ఆయన రచనకు స్థానం
10టిఎన్ఎల్01-షేక్ అబ్దుల్ హకీం జాని
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : పట్టణానికి చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ షేక్ అబ్దుల్ హకీం జానికి అరుదైన గౌరవం లభించింది. ఆయన రచనను మహారాష్ట్ర ప్రభుత్వం ఆరవ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చింది. దీనిపై హకీం జాని వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆరవ తరగతి తెలుగు వాచకం బాలభారతి లో హకీమ్ జాని రచించిన శీతల్ దేవి జీవిత చరిత్రను 'అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఆర్చర్ శీతల్ దేవి' శీర్షికతో పాటు వార్తాపత్రిక కత్తిరింపు చదువుదాం అనే ఉపశీర్షికతో ప్రచురించింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కిష్త్వార్ జిల్లా లోయిధర్ గ్రామానికి చెందిన శీతల్ దేవి పుట్టుకతోనే రెండు చేతులు లేని దివ్యాంగురాలు. పలువురి స్ఫూర్తితో కాళ్లతో విలువిద్య నేర్చుకుని 18 సంవత్సరాల అతి చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే శీతల్ దేవి ఇతివృత్తం పాఠ్యాంశంగా చేర్చడం విశేషం. మహారాష్ట్ర ప్రభుత్వం 2019లో హకీమ్ జానీ రచనలలో 'బాధ్యతాయుతమైన పౌరుడు' కథను 11వ తరగతిలో, 2020లో 'కొత్త వెలుగు' కథను 12 వ తరగతి పాఠ్యాంశాలుగా చేర్చారు. తన కథను పాఠ్యాంశంగా ఎంపిక చేసిన మహారాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మిత, పాఠ్యప్రణాళిక పరిశోధన సంస్థ తెలుగు కమిటీ అధ్యక్షురాలు భమిడిపాటి శారద, ఆ సంస్థ విశేషణాధికారి డాక్టర్ తులసి భరత్ భూషణ్ కు హకీంజాని కృతజ్ఞతలు తెలిపారు.








కామెంట్‌లు (0)