హాజరు కానున్న గవర్నర్
34896 మందికి పట్టాలు ప్రదానం : వైస్-చాన్స్‌లర్ ప్రొఫెసర్ వివి సుబ్బారావు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం–గురజాడ, విజయనగరం (జేఎన్‌టీయూ–జీవీ) ప్రథమ స్నాతకోత్సవాన్ని శనివారం విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జేఎన్‌టీయూ–జీవీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వి.సుబ్బారావు చెప్పారు. స్థానిక జెఎన్టియు ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో స్నాతకోత్సవ వివరాలను ఆయన వెల్లడించారు. జూలై 11న ఉదయం 11 గంటలకు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవంలో, రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్, ఎస్.అబ్దుల్ నజీర్ చేతులమీదుగా, యూనివర్సిటీ విద్యార్ధులకు పట్టాల అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి లోకేష్, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సిఈఓ మయూర్ పట్నాల తదితర ప్రముఖులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటారని ఆయన చెప్పారు. 2023, 2024, 2025 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన సుమారు 34,896 మందికి ఈ కాన్వకేషన్‌లో పట్టాలను అందజేయడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీరిలో 32,177 మందికి డిగ్రీ, 2,708 మందికి పిజి, 11 మందికి పిహెచ్‌డి, 50 మందికి బంగారు పతకాలు, ఇద్దరికి ఎండోమెంట్ పథకాలు, 37 అఫ్లియేటెడ్ కాలేజీలు, ఇద్దరికి కాన్‌స్టియెంట్ కాలేజీలు, ఒకరికి డాక్టరేట్ అందజేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. జెఎన్‌టియు విజయనగరం క్యాంపస్‌ను అత్యంత ఆదర్శవంతంగా, అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు విసి సుబ్బారావు తెలిపారు. ముఖ్యంగా అత్యంత వెనుకబడిన ప్రజలు నివసించే ఉత్తరాంధ్రలో అత్యున్నత సాంకేతిక విద్యను అందించి, సాంకేతికంగా అభివృద్ది చేసేందుకు జెఎన్‌టియు పరంగా తమవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్ధులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో రూ.3వేల తత్కాల్ ఫీజును రద్దు చేశామన్నారు. వారి సౌకర్యార్ధంగా వివిధ రకాల సేవలను, సర్టిఫికేట్లను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి కల్పించేలక్ష్యంతో, వారి పేర్లను నమోదు చేసుకొనేందుకు ఒక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పేజీలో నమోదు చేసుకున్న వారికి రానున్న మూడేళ్లలో 3వేల ఉద్యోగాలను కల్పించాలన్నది తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటికే తమ క్యాంపస్ ఎంఎస్ఎంఈ ఎక్స్‌టెన్షన్ సెంటర్‌గా ఎంపికయ్యిందని, నిరుద్యొగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఐటిఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఉత్తీర్ణులైన వారిలో 30 మందిని ఎంపిక చేశామని, వారికి జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చి, త్వరలోనే జర్మనీలో ఉద్యోగాలు చేసేందుకు పంపిస్తామని చెప్పారు. ఆరోగ్యవంతమైన క్యాంపస్‌ను రూపొందించే లక్ష్యంతో వారానికోసారి సేవ్ ఎర్త్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి డిగ్రీ పట్టాలను రూపొందించామని విసి వివరించారు. ఈ మీడియా సమావేశంలో రిజిస్ట్రార్ (ఇన్‌చార్జి) ప్రొఫెసర్ డి. రాజ్యలక్ష్మి, ప్రజా సంబంధాల అధికారి డి.డి.వి.శివరాం రోలంగి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)