మొత్తం తొలగింపుల్లో 51.7శాతం కేవలం 12 ఎస్‌టీ నియోజకవర్గాల్లోనే నమోదు
ఇంఫాల్ : మణిపూర్‌లో సర్‌తో ఎస్‌టి నియోజకవర్గాల్లో ఓటర్లను అత్యధికంగా తొలగించినట్లు నివేదిక స్పష్టం చేసింది. గతవారం (జులై5)న ముసాయిదా ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం (ఇసి) విడుదల చేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల వారీగా జరిగిన ఓటర్ల తొలగింపులను పరిశీలిస్తే.. మిగిలిన 41 అసెంబ్లీ నియోజకవర్గాలతో(ఎసిఎస్) పోలిస్తే, కుకీ-జో, నాగా వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే 19 ఎస్‌టి నియోజకవర్గాల్లో అసమానంగా అధిక ఓటర్ల తొలగింపులు జరిగినట్లు వెల్లడైంది. ముసాయిదా జాబితా ప్రకారం.. కొండ ప్రాంతాల్లోని 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల తొలగింపు గణనీయంగా ఉంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్ర ఓటర్ల జాబితాలో ఉన్న మొత్తం 20.93 లక్షల మంది ఓటర్లలో ఈ నియోజకవర్గాల వాటా 37.8శాతం. మొత్తం 1.59 లక్షల ఓటర్ల తొలగింపుల్లో 64.2శాతం (1.02లక్షలు)ఈ నియోజకవర్గాలవే ఉన్నట్ల తెలుస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా, మిగిలిన 41 నియోజకవర్గాలు (వీటిలో అధిక భాగం ఇంఫాల్ లోయలో ఉన్నాయి) మొత్తం ఓటర్లలో 62.2శాతం వాటాను కలిగి ఉన్నప్పటికీ, తొలగించబడిన పేర్లలో వీటి వాటా కేవలం 35.8శాతం (56,850) మాత్రమే. అంటే 41 నియోజకవర్గాల్లో తొలగించబడిన ప్రతి ఒక్క పేరుకు, 19 ఎస్‌టి నియోజకవర్గాల్లో సుమారు రెండు పేర్లు తొలగించినట్లు నివేదిక తెలిపింది. ఎస్‌టి నియోజకవర్గాల్లో ఓటర్ల తొలగింపులు అధికంగా చురాచంద్‌పూర్ జిల్లాలో, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యాయి.
20శాతం కంటే ఎక్కువ తొలగింపులు
ఈ ప్రాంతంలోని నాలుగు ఎస్‌టి నియోజకవర్గాల్లో కనీసం 20శాతం అంటే ప్రతి ఐదుగురు ఓటర్లలో ఒకరి చొప్పున ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. ఈ నాలుగింటిలో మూడు నియోజకవర్గాలు హెంగ్లెప్ (25.9శాతం తొలగింపులు), సింగ్‌హట్ (24.8శాతం), సైకోట్ (21.2శాతం), చురాచంద్‌పూర్ జిల్లాలో ఉన్నాయి. పొరుగున ఉన్న ఫెర్జావల్ జిల్లాలోని థాన్‌లోన్ ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 27.2శాతం ఓట్ల తొలగింపు నమోదైంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ముందు అక్కడ ఉన్న 17,291 మంది ఓటర్లలో 4,696 మంది పేర్లు తొలగించబడ్డాయి. నివేదిక ప్రకారం.. సైకోట్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో 14,152 ఓట్లు తొలగించబడ్డాయి. అక్కడ మొత్తం 66,664 మంది ఓటర్లు ఉండేవారు. మణిపూర్‌లో జరిగిన మొత్తం ఓట్ల తొలగింపులో సైకోట్ వాటా 9శాతంగా ఉంది. ఇప్పటికే ప్రస్తావించిన నాలుగు నియోజకవర్గాలతో పాటు చురాచంద్‌పూర్, తామెంగ్‌లాంగ్, చందేల్, ఉఖ్రుల్, టెంగ్నౌపాల్, నుంగ్బా, ఫుంగ్యార్, సైటు నియోజకవర్గాలను కలిపి మొత్తం 12 ఎస్‌టి నియోజకవర్గాల్లోనే 81,983 మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. ఇది రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన మొత్తం 1,58,677 పేర్లలో 51.7 శాతమని నివేదిక తెలిపింది.







కామెంట్‌లు (0)