శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చేపల చెరువుల్లో చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు

1 గంట క్రితం

Poultry waste used as feed for fish in fish ponds.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 04:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రజల ఆరోగ్యానికి కోళ్ల వ్యర్థాల ముప్పు...

  • హైదరాబాద్ నుంచి అక్రమ రవాణా...

  • చేపల చెరువుల్లో చేపలకు ఆహారంగా వినియోగం...

  • ముప్పాళ్ల మండలం తొండేపిలో వాహనం పట్టుకున్న పోలీసులు...


ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : హైదరాబాద్ నుంచి కోళ్ల మాంసం వ్యర్థాలను భారీగా తరలించి పల్నాడు జిల్లాలోని చేపల చెరువుల్లో దాణాగా వినియోగిస్తున్న వ్యవహారం జిల్లాలో కలకలం రేపుతుంది. ఇటీవల ముప్పాళ్ల మండలం తొండపి ప్రాంతంలో చేపల చెరువుకు కోళ్ల మాంసం వ్యర్థాలను తీసుకొచ్చిన వాహనాన్ని పోలీసులు పట్టుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ముప్పాళ్ల మండల పోలీసులు కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పల్నాడు జిల్లా లోని అమరావతి పరిసరాలు, నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారం, లింగంగుంట్ల, చిలకలూరిపేట, వినుకొండ తదితర ప్రాంతాల్లోని కొన్ని చేపల చెరువుల్లో కోళ్ల మాంసం వ్యర్థాలను దాణాగా వినియోగిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పంగస్, క్యాట్‌ఫిష్, రూప్‌చంద్ వంటి చేపల పెంపకంలో ఈ వ్యర్థాలను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. వినుకొండ, మాచర్ల, నకరికల్లు ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి హైదరాబాద్ నుంచి కోళ్ల వ్యర్థాలను సేకరించి జిల్లా లోని చేపల చెరువులకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా పెంచిన చేపలను తక్కువ ధరలకు హోటళ్లు, రెస్టారెంట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆహార భద్రతకు విరుద్ధంగా కోళ్ల మాంసం వ్యర్థాలను చేపల దాణాగా వినియోగించడం ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యర్థాల ద్వారా ప్రమాదకర సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉందని, సంబంధిత శాఖలు వెంటనే విస్తృత తనిఖీలు చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముప్పాళ్ల పోలీసులు పట్టుకున్న వాహనానికి సంబంధించిన వివరాలు, కోళ్ల వ్యర్థాల మూలం, వాటిని సరఫరా చేస్తున్న నెట్‌వర్క్, చేపల చెరువులకు తరలించిన విధానం తదితర అంశాలపై విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్