రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు
ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదై, సాగు విస్తీర్ణం కూడా తక్కువగా ఉన్న రొంపిచర్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రం రొంపిచర్ల చెరువుకట్ట సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ బి. నిర్మలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ .. మండలం లోని పేద రైతుల భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చి, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర సౌకర్యాలు అందకుండా చేయడం సరికాదన్నారు. రీసర్వేలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే వాటిని పరిష్కరించాలని కోరారు. పెద్ద పారిశ్రామికవేత్తల వేల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతుల పంట రుణాలను కూడా మాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పశువులకు అవసరమైన పశుగ్రాసాన్ని ఉచితంగా అందించాలని కోరారు.
సీఐటీయూ మండల కార్యదర్శి సరికొండ వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చౌకధరల దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను ప్రజలకు అందించాలని కోరారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులను నిజమైన పేదలకు కల్పించాలని, పనుల్లో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని డిమాండ్ చేశారు. రొంపిచర్ల లో చెరువుల నీటిని గ్రామానికి తరలించే విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్య వైఖరి అవలంభించడాన్ని విమర్శించారు. కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు కామినేని రామారావు మాట్లాడుతూ మండలం లోని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందడం లేదన్నారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేసి ఒకే విడతలో రూ.20 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. దేవాదాయ భూములను సాగు చేస్తున్న రైతులందరికీ సీ.సీ.ఆర్.సీ కార్డులు ఇచ్చి గుర్తింపు కల్పించాలని, రానున్న రబీ సీజన్ కు సబ్సిడీపై విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బండారుపల్లి నాగేశ్వరరావు, అంజిరెడ్డి, బాలకోటయ్య అధిక సంఖ్యలో రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)