చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల బకాయిల విడుదల కోసం సిపిఎం మద్దతు
ఇంటికో పారిశ్రామికవేత్త ఏమో కానీ బికారులను చేయొద్దంటూ వినతి
కొనసాగుతున్న నిరసన దీక్షలు
మంగళగిరి రూరల్ (గుంటూరు) : రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తానంటూ ప్రగల్బాలు పలుకుతూ చిన్న తరహా పారిశ్రామికవేత్తలను బకాయిల ఊబిలో ముంచుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు దుయ్యబట్టారు. పెద్దలకు కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ చిన్న తరహా పరిశ్రమల ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ .... పారిశ్రామికవేత్తలు గత 20 రోజులుగా చిన్న కాకానిలోని ఎన్నారై సర్కిల్ వద్ద తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన 'మహా ధర్నా'లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండా మాల్యాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నిరసన దీక్షా శిబిరాన్ని సందర్శించి, చిన్న తరహా పారిశ్రామికవేత్తల పోరాటానికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ .... మినీ, సూక్ష్మ పరిశ్రమల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. చిన్న పారిశ్రామికవేత్తల సమస్యలను విస్మరించడం సరికాదని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, సబ్సిడీ బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అని నినాదాలు ఇస్తున్న ప్రభుత్వం, ఈ చిన్న పరిశ్రమల విషయంలో మాత్రం నిర్లక్ష్యాన్ని చూపిస్తోందని ఆరోపించారు. గూగుల్, అదాని, అంబానీ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు రాయితీలపై రాయితీలను అందిస్తూ చిన్న తరహా పరిశ్రమలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా పోలీసు దిగ్బంధనంలో నిరసనకారులను ఉంచడానికి ఆయన తప్పుపట్టారు. జేబుకు గల అంబేద్కర్ బ్యాడ్జీలను తీసి వస్తేనే అనుమతి ఇస్తామంటూ పేర్కొనడం అంబేద్కర్ ను అవమానించడమేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బకాయిలు అడిగితే బానిసలుగా చూసే విధానం సరికాదన్నారు. బకాయిలు అన్నింటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి భరోసా ఇచ్చారు.

ఇంటికో పారీశ్రామికవేత్త ఏమో గాని బికారులను మాత్రం చెయ్యొద్దు - కెవిపిఎస్, అండా మాల్యాద్రి
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం తక్షణమే పెండింగ్‌లో ఉన్న బకాయిలు, సబ్సిడీలను విడుదల చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండా మాల్యాద్రి డిమాండ్ చేశారు. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చేసే పోరాటానికి కేవీపీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఆర్థిక, సామాజిక ఇబ్బందులను అధిగమించి ఎస్సీ, ఎస్టీలు పరిశ్రమలు స్థాపించారని, దాదాపు 25 వేల కుటుంబాలు వీటిపై ఆధారపడి జీవిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. అయితే, ప్రభుత్వం నుండి రావాల్సిన సబ్సిడీలు మరియు నిధులు మంజూరు కాకపోవడంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే దళిత సంఘాల నేతలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించినట్లు మాల్యాద్రి తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఇటీవల సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను సైతం కలిసి పరిస్థితిని వివరించామన్నారు. అయితే, నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోకుండా మంత్రి కేవలం మాయమాటలు చెప్పి పంపించారని ఆయన విమర్శించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పినట్లుగా హక్కులు, సమస్యల పరిష్కారం పోరాడితేనే సాధ్యమవుతాయని, ప్రాధేయపడితే రావని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దశలవారీగా అన్ని దళిత, ప్రజా సంఘాలు మరియు రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. గతంలో ఏపీఐఐసీ భవనం వద్ద పారిశ్రామికవేత్తలను అరెస్టు చేసినప్పుడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అండగా నిలిచారని, ఈ సమస్యపై ముఖ్యమంత్రికి, మంత్రులకు లేఖలు కూడా రాశారని మాల్యాద్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇంటికొక పరిశ్రమ ఉండటం మంచిదే అయినప్పటికీ, ఇప్పటికే ఉన్న వేలాది ఎస్సీ, ఎస్టీ పరిశ్రమలకు కనీస నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి పారిశ్రామికవేత్తల బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు.








కామెంట్‌లు (0)