రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం,ప్రజా సంఘాల నిరసనలు
ప్రజాశక్తి - యంత్రాంగం : ఓటర్ల జాబితాలో అనేక అక్రమాలకు కేంద్ర బిందువైన చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణం బర్తరఫ్ చేసి ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దాలని రాష్ట్రవ్యాప్తంగా సోమవారం వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు నిరసనలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి అమిత్ షా, నరేంద్ర మోడీలకు తొత్తుగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియను తంతుగా మార్చేశారని, ఆయనకు ఎలక్షన్ కమిషనర్‌గా అధికారంలో ఉండే హక్కు లేదని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని గడియారస్తంభం సెంటర్‌లో నిరసన తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం మాట్లాడుతూ సిఇసి ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యానికే తీవ్ర ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సూచనలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎస్‌ఐఆర్ పేరిట 13 కోట్ల ఓట్లను తొలగించడం దారుణమన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ పేరుతో జరిగిన ఓట్ల తొలగింపుపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, 2023లో తీసుకొచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి కేబినెట్ మంత్రిని తొలగించి, ఆ స్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రాతినిథ్యం కల్పించాలని కోరారు. సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు కె.సత్తిబాబు, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి కె.రవి, ఎపి ఆర్.పిఎ రాష్ట్ర కోశాధికారి ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఆలూరు, ఎమ్మిగనూరు కోడుమూరు, నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు, బేతంచర్లలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు, కర్నూలు జిల్లా ఆలూరులో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు, ఎమ్మిగనూరులో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు.
నెల్లూరులో వామపక్ష, ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఐ జిల్లా నాయకులు ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆధ్వర్యాన సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించాయి. సిఐటియు జిల్లా అధ్యక్షులు టి వివి ప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలివెంగయ్య, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుళ్లూరు గోపాల్, సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు ఎం.మోహన్‌రావు పాల్గొన్నారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ రెండొ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలు పట్టణ కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం పిలుపునిచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట వామపక్షాలు నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగురునాయుడు మాట్లాడారు. కురుపాంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాచిపెంటలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన ఆందోళన చేశారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ కుమార్ మాట్లాడారు.
పశ్చిమగోదావరి జిల్లాలో సిపిఎం ఆధ్వర్యాన పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. వీరవాసరం తూర్పు చెర్వు సెంటర్‌లో, పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు వంతెనపై నిరసన ప్రదర్శన చేశారు. ఆచంట కచేరీ సెంటర్‌లో నిరసన తెలిపారు.
అనంతపురం టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద నిరసన తెలిపారు. గుంతకల్లు, పుట్లూరు, రాప్తాడు మండలాల్లో నిరసన తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో సిపిఎం జిల్లా కన్వీనర్ వాడ గంగరాజు మాట్లాడారు.
శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి.చందు, జిల్లా గర్ల్స్ కన్వీనర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)