రాంచీ : రూ.39 లక్షల రివార్డు కలిగిన ఆరుగురితో పాటు 16మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు జార్ఖండ్ పోలీసులు మంగళవారం తెలిపారు. వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారని అన్నారు. రూ.15 రివార్డు కలిగి ఉన్న నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) ప్రాంతీయ కమిటీ సభ్యుడు సంతోష్ మహతో అలియాస్ బసుదేవ్ దా అలియాస్ దిలీప్ కూడా వారిలో ఉన్నట్లు తెలిపారు. ఆయనపై వివిధ జిల్లాల్లోని వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో 128 కేసులు నమోదయ్యాయని అన్నారు. మార్చి1న మనోహర్‌పూర్, చోట్‌నగర్, ఝరియాకెలా సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో అటవీ ప్రాంతంలో జరిగిన ఐఇడి పేలుడులో సంతోష్ మహతోకి ప్రమేయం ఉందని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనలో కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఒక జవాన్ గాయపడ్డారని అన్నారు.
78 కేసుల్లో నిందితుడు, రూ. 10 లక్షల రివార్డు కలిగిఉన్న మరో సిపిఐ (మావోయిస్ట్) జోనల్ కమిటీ సభ్యుడు చందన్ లోహ్రా కూడా లొంగిపోయారని ఆ అధికారి పేర్కొన్నారు. రూ.5 లక్షల చొప్పున రివార్డు కలిగిన సబ్ జోనల్ కమిటీ సభ్యులు అనిల్ తురి అలియాస్ ఉజ్వల్ , సుఖ్‌లాల్ బిర్జియాన్ అలియాస్ అకేలాలు, జోనల్ కమిటీ సభ్యుడు సంతోష్ మాంఝీ అలియాస్ జగబంధు కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారని అన్నారు. అలాగే రూ.2లక్షల చొప్పున రివార్డు కలిగిన ఏరియా కమిటీ సభ్యులు సుదేష్ హోన్షాగా అలియాస్ సోనారామ్ హోన్షాగా, రిసివ్‌లు వారిలో ఉన్నారని అన్నారు. మావోయిస్టుల నుండి రెండు ఎకె-47 రైఫిల్స్ , ఆరు ఐఎన్ఎస్‌ఎఎస్‌లు, 1,562 కాట్రిగ్జ్స్, 38 మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.







కామెంట్‌లు (0)