అమెరికా : సముద్రంలో ఉధృతంగా ఎగిసిపడుతున్న అలల మధ్య ప్రాణాపాయంలో చిక్కుకున్న ఓ పదేళ్ల బాలుడిని లైఫ్‌గార్డ్ అసాధారణ సాహసంతో రక్షించిన ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. భారీ కెరటాలను లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అతని ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని సైప్రస్ బీచ్‌లో చోటుచేసుకుంది. ఫొటోగ్రాఫర్ స్కాట్ సముద్ర తీరంలో చిత్రాలు తీస్తుండగా, అలల మధ్య ఒక బాలుడు కొద్దిసేపు కనిపించి మళ్లీ కనిపించకుండా పోతుండటాన్ని గమనించాడు. వెంటనే పరిస్థితి తీవ్రతను గుర్తించి అక్కడి లైఫ్‌గార్డ్‌కు సమాచారం అందించాడు. సర్ఫ్‌బోర్డ్‌పై అలలను ఆస్వాదిస్తున్న ఆ బాలుడు ఒక్కసారిగా పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ వస్తున్న కెరటాల బారిన పడి ప్రమాదంలో చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న లైఫ్‌గార్డ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సముద్రంలోకి దూకి, భారీ అలలను ఎదుర్కొంటూ బాలుడి వద్దకు చేరుకున్నాడు. అతడిని గట్టిగా పట్టుకుని రాకాసి కెరటాలను ఛేదిస్తూ ఎంతో శ్రమతో సురక్షితంగా బాలుడిని తీరానికి తీసుకొచ్చాడు. రక్షణ చర్యల్లో భాగంగా మరికొందరు సహాయం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, అలల ధాటికి వారు వెనుదిరగాల్సి వచ్చింది. అయితే లైఫ్‌గార్డ్ మాత్రం ఎలాంటి భయానికి లోనుకాకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించి బాలుడి ప్రాణాలను కాపాడటంలో విజయం సాధించాడు. మరింత విశేషమేమిటంటే .... ఇదే ఆ లైఫ్‌గార్డ్‌కు తొలి రెస్క్యూ ఆపరేషన్ కావడం. తొలి ప్రయత్నంలోనే అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఒక బాలుడి ప్రాణాలను కాపాడడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సుదూర పసిఫిక్ హరికేన్ ప్రభావంతో ఏర్పడిన భారీ అలల మధ్య ఈ విజయవంతమైన రక్షణ చర్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.







కామెంట్‌లు (0)