లక్నో : విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎఎంయు)లో కొనసాగుతున్న ఆందోళనతో శనివారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొందని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరసనకారులు క్యాంపస్‌లోని నాలుగు ప్రవేశ ద్వారాలను దిగ్బంధించారని, నిరసనకారులు ప్రొక్టర్ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని పేర్కొన్నారు. క్యాంపస్‌లోని ఎంఎం హాల్ హాస్టల్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారని, వారిలో ముగ్గురు ఎఎంయు విద్యార్థులు కాగా, నాలుగో వ్యక్తి బయటి వ్యక్తి అని ప్రొక్టర్ నవేద్ ఖాన్ తెలిపారు. ముగ్గురు విద్యార్థులను విడుదల చేయగా, నాలుగో వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు చెప్పారు. బయటి వ్యక్తులు హాస్టల్‌లో ఉన్నారన్న సమాచారంతోనే పోలీసులు చర్యలు తీసుకున్నారని, దీనిలో విశ్వవిద్యాలయ అధికారుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
దాదాపు ఎనిమిదేళ్లుగా జరగని విద్యార్థి సంఘ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సస్పెండ్ అయిన పీజీ విద్యార్థి యాసిర్ ఫహద్ సెప్టెంబర్ 21 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిరసన కొనసాగుతోంది. ఆదివారం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విద్యార్థుల డిమాండ్‌కు మద్దతు ప్రకటించి, వారితో వెంటనే చర్చలు జరపాలని విశ్వవిద్యాలయ అధికారులను కోరారు.
మరోవైపు, యూనివర్సిటీ కోర్టు, కార్యనిర్వాహక మండలి, అకడమిక్ మండలికి ఉపాధ్యాయ ప్రతినిధుల ఎన్నికలను కూడా తక్షణమే నిర్వహించాలని ఎఎంయు ఉపాధ్యాయుల సంఘం (ఎఎంయుటిఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం కార్యదర్శి అష్రఫ్ మతీన్ వైస్‌చాన్స్‌లర్ నైమా ఖతూన్‌కు లేఖ రాశారు. దిగ్బంధించిన ప్రవేశ ద్వారాలను ఆదివారం తెల్లవారుజామున విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది తిరిగి తెరిచారు.








కామెంట్‌లు (0)