మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిద్యార్థులేమైనా ఉగ్రవాదులా?

1 గంట క్రితం

PTI07282026000369B17852400080844932-1785258262733-3483.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 11:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అమిత్‌ షా జవాబు చెప్పాలి

  • యాంటీ పేపర్ లీక్‌ బిల్లుపై చర్చలో నిలదీసిన ప్రతిపక్షాలు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?’ అని ప్రతిపక్ష పార్టీలు నిలదీశాయి. ‘నీట్ ప్రశ్నాపత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు చేసిన దమన కాండకు హోంశాఖ మంత్రి అమిత్‌‌షా జవాబు చెప్పాల్సిందే’ అని డిమాండ్‌ ‌చేశాయి. మంగళవారం లోక్‌స‌భ‌లో ప‌బ్లిక్ ఎగ్జామినేష‌న్స్ స‌వ‌ర‌ణ బిల్లుపై చ‌ర్చ జ‌రిగింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ‌బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్‌ ‌లీకేజి ఘటనల్లో కఠిన శిక్షలు విధించేందుకు ఈ బిల్లును రూపొందించినట్లు చెప్పారు. అనంతరం మాట్లాడిన ప్రతిపక్షనేతలు విద్యార్థుల ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘టియర్ గ్యాస్ ఎందుకు ప్రయోగించారు. విద్యార్థులపై పెల్లెట్‌ గన్స్‌ ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది’ అని ప్రశ్నించారు. ‘ఆ చర్యలకు ఆదేశించింది ఎవరు? ప్రధాన మంత్రా.. హోం మంత్రి అమిత్‌‌షా నా,,,’ అని నిలదీశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కబ్జాలో విద్యావ్యవస్థ : ప్రియాంక గాంధీ

దేశ విద్యావ్యవస్థను ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కబ్జా చేసిందని కాంగ్రెస్‌ ‌ఎంపి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్‌‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో సార్లు పేపర్‌ ‌లీక్‌ ‌సంఘటనలు జరిగాయని, ఇప్పటి వరకు ఒక్కరిపైనా కూడా చర్యలు తీసుకోలేదని అన్నారు. సిజెపి ఆందోళనలను అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించిందని, మహిళలపై దాడులు చేయించి, దుస్తులు చించి వేయించిందని అన్నారు. భద్రతా సిబ్బంది చేతిలో తీవ్ర హింసకు గురైన ఒక బాలిక రామ్‌ మనోహర్ లోహియా ఆసుపత్రి ఐసియులో ప్రాణాల కోసం పోరాడుతున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. విద్యార్థులపై లాఠీలు, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు, పెల్లెట్ గన్‌లు, ఎకె 47లను ప్రయోగించడానికి అనుమతి చ్చింది ఎవరని ప్రశ్నించారు. పదవికి రాజీనామా చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌‌కు ఎన్‌‌డిఎ ఎంపీలు ఘనస్వాగతం పలకడం.. సిగ్గుపడేలా ఉందన్నారు.

ప్రవేశ పరీక్షలను వికేంద్రీకరించాలి : ఎస్‌.వెంక‌టేశన్‌

సిపిఎం ఎంపి ఎస్‌. వెంక‌టేశన్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఈ నిరసన ప్రతిబింబిస్తోందని అన్నారు. ‘‘ప్రభుత్వం విద్యా రంగాన్ని కాషాయీకరణ చేస్తోంది. నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) ఆ లక్ష్యంతోనే రూపొందించబడింది. ఎన్‌టిఎను రద్దు చేసి, ప్రవేశ పరీక్షలను వికేంద్రీకరించాలి. ప్రభుత్వం కనీసం ప్రతిపక్ష పార్టీల డిమాండ్లను వినడానికైనా సిద్ధపడాలి’ అని అన్నారు.

​విరాళాలు దొంగ‌లించిన వారు పేప‌ర్ లీక్‌ను*ఆప‌లేరు : అఖిలేష్ యాద‌వ్‌

​ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి దించి ప్రధాని మోడీని బిజెపి కాపాడిందని ఎస్‌పి నేత‌ అఖిలేశ్‌ యాదవ్ అన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేలా ఒత్తిడి తెచ్చిన యువత నిరసనలను ఆయన ప్రశంసించారు. దేవాలయాల విరాళాలను దొంగిలించిన వారు.. ప్రశ్నాపత్రాల లీకేజీని ఆపలేరని వ్యాఖ్యానించారు. ‘నేను ఎమర్జెన్సీని చూడలేదు. దేశ రాజధానిలో ఇప్పుడేం జరిగిందో మాత్రం చూశా’ అని అన్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: గౌర‌వ్ గొగోయ్‌

​ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కంటే ఎక్కువ‌గా ఇన్‌స్టా రీల్స్ పైనే దృష్టి పెడుతున్నార‌ని కాంగ్రెస్ నేత‌ గౌరవ్‌ గొగోయ్‌ వ్యాఖ్యానించారు. పేపర్‌ లీక్‌లకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటం చేస్తుంటే.. మోడీ మాత్రం రీల్స్‌ చేస్తూ కూర్చున్నారని విమర్శించారు. తప్పును ఎదిరించి పోరాట స్ఫూర్తిని చాటిన విద్యార్థులకు గొగోయ్‌ ధన్యవాదాలు తెలిపారు. నిరసనకారులపై ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించిందని, వారి తలలపై పోలీసులు కొట్టారని విమర్శించారు.

. ఈ బిల్లుపై అభిషేక్ బెన‌ర్జీ (టిఎంసి), సుప్రియా సులే (ఎన్‌సిపి), ద‌యానిధి మారెన్ (డిఎంకె), ఎస్‌.వెంక‌టేష‌న్ (సిపిఎం), డింపుల్ యాద‌వ్ (ఎస్‌పి), కెసి వేణుగోపాల్ (కాంగ్రెస్‌), లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయలు (టిడిపి), మ‌ద్దిల గురుమూర్తి (వైసిపి), శ్రీకాంత్ షిండే (శివ‌సేన‌-షిండే), అనురాగ్ సింగ్ ఠాకూర్‌, తేజ‌శ్వీ సూర్య (బిజెపి), అలోక్ కుమార్ సుమ‌న్ (జెడియు), అరుణ్ భార‌తీ (ఎల్‌జెపి), ష‌ర్మిలా సర్కార్ (టిఎంసి రెబ‌ల్‌) త‌దిత‌రులు మాట్లాడారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్