- ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్‌కు రాజస్థాన్ దళిత పూజారి లేఖ
జైపూర్ : రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా, బరానా గ్రామంలోని ఖకుల్ దేవ్ ఆలయాన్ని శతాబ్దాల క్రితం దళితులు నిర్మించుకుని, వంశపారంపర్య పూజారులుగా వుంటున్నారు. అలాంటి ఆలయ పూజారి విష్టు కుమార్ బాలాయ్ ని పూజలు చేయడానికి వీలులేదని, దళితులు ఆలయంలోకి రాకూడదని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం రాజకీయ అంశంగా మారింది . ‘ది వైర్’’ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది.
ఈ ఏడాదిలో రెండుసార్లు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుల దాడికి గురైన పూజారి విష్ణుకుమార్ ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్‌కు “మేము హిందువులం కాదా?” అని అడుగుతూ లేఖ రాశారు. ఈ లేఖలో ఆలయ ఆర్చకత్వంపై తమకున్న చారిత్రక ఆధారాలను చూపారు. బ్రాహ్మణ దేవాలయాలలోకి ప్రవేశం కోరడమో, లేదా బ్రాహ్మణ ప్రదేశాలలో పూజలు నిర్వహించే హక్కును డిమాండ్ చేయడమో కాదని చారిత్రాత్మకమైన తమ స్వంత దేవాలయంలోకి ప్రవేశాన్ని కోరుతున్నామని తెలిపారు.
రాజస్తాన్‌ను పాలించిన మహారాణా ప్రతాప్ మనవడైన మేవార్ మహారాణా కరణ్ సింగ్ కీ.శ. 1624లో జారీ చేసిన తామ్రపత్రం (రాగి ఫలకంపై ఇచ్చిన శాసనం) ద్వారా పూజారులుగా, యజమానులుగా దళితుల స్థానం గుర్తించబడింది. కుల భేదాలకు అతీతమైన ఆరాధన కలిగిన, 14వ శతాబ్దపు తోమర్ నాయకుడైన బాబా రామ్‌దేవ్‌జీ ఆలయంలో, చారిత్రాత్మకంగా రాజపుత్రులు, మేఘ్వాల్‌లు వంశపారంపర్యంగా కర్మకాండలు నిర్వహిస్తూ వచ్చారు. నిజానికి, బాబా రామ్‌దేవ్ ప్రధాన ఆలయంలో రామ్‌దేవ్‌జీ, ఆయన మేఘ్వాల్ ధర్మసోదరి అయిన దాలిబాయిజీ ఇద్దరి సమాధులు ఉన్నాయి. బాబా రామ్‌దేవ్ తోమర్ రాజపుత్రుడైనప్పటికీ, దళిత సాధువైన మేఘఋషి స్థాపించిన సంప్రదాయంలో ఆయనను ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణిస్తారు. అదేవిధంగా, మరో రాజపుత్ర జానపద వీరుడైన పాబుజీ రాథోర్‌కు సంబంధించిన సంప్రదాయాలు, వంశపారంపర్య కర్మకాండల నిపుణులుగా గౌరవించబడ్డారు.
‘భూస్వామ్య రాజ్యంలో అనేక లోపాలు వున్నా, దళితులను వంశపారంపర్య పూజారులుగా గుర్తించడమే కాకుండా, ఆలయాలు, వాటికి అనుబంధంగా ఉన్న భూములపై వారికి హక్కులను కల్పించింది. నేటి ప్రజాస్వామ్య భారతదేశంలో, అటువంటి వంశపారంపర్య హక్కులు అంతకంతకూ ఎక్కువగా హరించబడుతున్నాయి’ అని భాన్వర్ మేఘవంశీ చేప్పిన మాటలు వాస్తవ పరిస్థితికి దర్పణం పడుతున్నాయి.
2023లో విష్ణు కుమార్ బాలాయ్ అర్చకత్వాన్ని స్థానిక అగ్రకులస్థులు అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలైంది. సంపత్ జాట్ అనే ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడు, ఇతరులతో కలిసి ఆలయ సాంప్రదాయ వారసత్వాన్ని మార్చడానికి, పూజారిగా దళితున్ని తొలగించడానికి ప్రయత్నించారు. తర్వాతి రెండేళ్లలో ఈ విభేదం మరింత తీవ్రమైంది. ఈ వివాదం కారణంగా, సాంప్రదాయకంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించే ఖకుల్ దేవ్ జాతరను వేరే చోటికి మార్చుకున్నట్లు విష్ణు చెప్పారు. ఆగస్టు 14, 2025న, ఆలయం లోపల తనపైనా, తన కుటుంబంపైనా దాడి జరిగిందని, కులపరమైన దూషణలకు పాల్పడ్డారని, మతపరమైన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని విష్ణు ఆరోపించడంతో ఈ వివాదం హింసాత్మకంగా మారింది. వివాదం కొనసాగుతున్నదనే సాకుతో రాజస్థాన్ ప్రభుత్వం స్థానిక తహసీల్దార్ ఆధీనంలో ఆలయాన్ని పెట్టింది. దీనివల్ల విష్టుకుమార్ కుటుంబానికి ఉన్న వంశపారంపర్య హక్కు ప్రమాదంలో పడింది.








కామెంట్‌లు (0)