శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసమావేశమవడం, నిరసన తెలియజేయడం ప్రాధమిక హక్కు

2 గంటల క్రితం

manbaby 2 image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 12:01 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • స్పష్టం చేసిన ఐదు వామపక్షాలు

  • ఢిల్లీలో అసాధారణ ఆంక్షలను ఖండించిన నేతలు

న్యూఢిల్లీ : సమావేశమయ్యే, నిరసన తెలియజేసే హక్కు ప్రాధమిక హక్కని వామపక్షాలు స్పష్టం చేశాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు, ఎన్నికల కమిషన్‌ ‌పనితీరుకు వ్యతిరేకంగా ఈ నెల 10న జరపతలపెట్టిన ప్రజా సమీకరణను అడ్డుకుని, అణచివేసేందుకు కేంద్ర హోం మంత్రి ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు విధించిన అసాధారణ ఆంక్షలను ఐదు వామపక్ష‍ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ ‌ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ ‌భట్టాచార్య, ఎఐఎఫ్‌‌బి ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్‌, ఆర్‌ఎస్‌‌పి ప్రధాన కార్యదర్శి మనోజ్‌ ‌భట్టాచార్య శుక్రవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రతిపాదిత ప్రదర్శనకు అనుమతిని నిరాకరించడం, విస్తృతంగా బారికేడ్లు, నిషేధాజ్ఞలు విధించడం, 57 మెట్రో స్టేషన్లను మూసివేయడం, ఢిల్లీ వెళ్లే రైళ్లను రద్దు చేయడం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో గృహ నిర్బంధాలు, మొత్తంగా దేశ రాజధాని ప్రాంతంపై పెద్ద ఎత్తున భద్రతా చర్యలు - ఇవన్నీ శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ప్రజలకు గల ప్రాధమిక హక్కులపై, రాజ్యాంగ హక్కులపై దాడి చేయడమేనని వామపక్షాలు విమర్శించాయి. వివిధ ప్రాంతాల్లో విద్యార్ధులను నిర్బంధించినట్లు, విద్యార్ధి సంఘాల కార్యాలయాలపై నిఘా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయని వామపక్షాల నేతలు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆంక్షలు, అణచివేత చర్యల వల్ల సామాన్యులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని, వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని, వేధింపులకు గురవుతున్నారని ఆ ప్రకటన పేర్కొంది. ఈ నెల 10వ తేదీ శనివారం నాటి నిరసన కార్యక్రమంలో పాల్గొనబోయే వారిని బెదిరించడాన్ని, వేధించడాన్ని ఆపాలని ఢిల్లీ పోలీసులను, కేంద్ర ప్రభుత్వాన్ని ఐదు వామపక్ష‍ాల నేతలు డిమాండ్‌ ‌చేశారు. నిరంకుశంగా ప్రజలను నిర్బంధించడాన్ని మానుకోవాలన్నారు. అడ్డంకులను సృష్టించడం మాని, జంతర్‌ ‌మంతర్‌ ‌వద్దకు వెళ్లేందుకు, అక్కడ నిరసన తెలియజేసేందుకు ప్రజలను అనుమతించాలని వారు ఆ ప్రకటనలో కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్