- రాహుల్ గాంధీ పిటీషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. రాహుల్‌గాంధీపై ఉన్న ఈ ఆరోపణలపై సిబిఐ, ఇడిల చేత విచారణ జరిపించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును రాహుల్‌గాంధీ ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించనుంది. కర్ణాటకకు చెందిన బిజెపి కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన క్రిమినల్ రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పై విధంగా ఉత్తర్వులు జారీచేసింది. రాహుల్‌గాంధీపై ఆరోపణలపై సిబిఐ ఇప్పటికే జారీ చేసిన అఫిడవిట్ సంతృప్తికరంగా లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలోని సిబిఐ అవినీతి నిరోధక ప్రధాన కార్యాలయంలోని జాయింట్ డైరెక్టర్ లేదా సంబంధిత జోన్ అధిపతి వ్యక్తిగతంగా కొత్త అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
సిబ్బంది-శిక్షణ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ తరఫున వివరణాత్మక కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నాలుగు వారాల సమయం కూడా ఇచ్చింది.







కామెంట్‌లు (0)