ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజెపి కార్యకర్త ఇంటిపై బిజెపి గూండాల దాడి

1 గంట క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 12:39 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- విద్యార్థి తండ్రి మృతి - ముగ్గురి అరెస్టు

కొల్‌‌కతా : కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సిజెపి) పిలుపులో భాగంగా పాఠశాలల తనిఖీకి వెళ్లిన ఆ పార్టీ వలంటీర్‌ ‌తండ్రి జనాబ్‌ ‌మాఫిక్‌ బిజెపి గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించారు. బిజెపి గూండాలు విచక్షణా రహితంగా దాడి చేయడం వల్లే తన తండ్రి మరణించాడని మృతుడి కుమారుడు, సిజెపి వలంటీర్‌ ‌షేక్‌ అబ్దుల్‌ ‌హఫీజ్‌ చెప్పారు. ‌నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని సిజెపి డిమాండ్‌ ‌చేసింది. సిజెపి వలంటీర్‌, మృతుడి కుమారుడు హఫీజ్‌ ‌కథనం ప్రకారం... ‘పాఠశాలలను మెరుగుపరచండి’ అన్న సిజెపి పిలుపులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లా కరిసుంద ప్రాంతంలోని తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఈ నెల 13న ఆ పార్టీ వలంటీర్లు పరిశీలించారు. ఆ రోజు సాయంత్రం, సాయుధులైన కొందరు వ్యక్తులు, స్థానిక బిజెపి కార్యకర్తలుగా చెబుతూ హఫీజ్‌ ఇంట్లో బలవంతంగా ప్రవేశించారు. పాఠశాల పరిస్థితులను ప్రస్తావించినందుకు క్షమాపణ చెబుతూ ఒక వీడియో స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని డిమాండ్ చేశారు. హఫీజ్ అందుకు నిరాకరించడంతో, దుండగులు అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో హఫీజ్‌కు మెడపై తీవ్ర గాయం కాగా, తన కుమారుడిని కాపాడటానికి ప్రయత్నించిన అతని తండ్రి జనాబ్ మాఫిక్‌కు తలకు తీవ్రమైన దెబ్బ తగిలింది. శనివారం జనాబ్‌ ‌మాఫిక్‌ గాయాలతో ప్రాణాలు కోల్పోయారు.

దాడి చేసింది బిజెపి వారే : హఫీజ్‌

తన తండ్రి మరణానికి బిజెపి గూండాలే కారణమని హఫీజ్‌ ‌స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “వారందరూ స్థానిక బిజెపికి చెందినవారే. నాపై దాడి చేయలేకపోయామనే కోపంతో వారు మా నాన్నపై దాడి చేశారు. పోలీసులు రావడంతో మేము మా నాన్నను ఆసుపత్రికి తరలించాం. నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని భావించి, చాలా మంది బిజెపి కార్యకర్తలు ఆసుపత్రిని చుట్టుముట్టి మమ్మల్ని వెళ్లనివ్వలేదు... మేము ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, దుండగులు మళ్లీ మమ్మల్ని ఒక చీకటి ప్రదేశంలో చుట్టుముట్టి రెండోసారి దాడి చేశారు. వారు నా మొబైల్ ఫోన్‌ను తీసుకుని, సోషల్ మీడియా నుంచి అన్ని వీడియోలను తొలగించారు.”

​దాడి తర్వాత ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయలేదు : సిజెపి

ఈ ఘటనను సిజెపి తీవ్రంగా ఖండించింది. సిజెపి వలంటీర్‌ ఇంటిపై దాడి చేసిన తర్వాత ఎందుకు మెడికలో లీగల్‌ ‌కేసు నమోదు చేయలేదని, ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్‌ ‌చేసింది. హఫీజ్‌ ‌కుటుంబానికి అండగా ఉంటామని సిజెపి వ్యవస్థాపకులు అభిజిత్‌ ‌దీప్కే ఎక్స్‌‌లో పోస్టు పెట్టారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. హింస ద్వారా భయపెట్టాలని ప్రయత్నిస్తే తాము మరింత గట్టిగా పోరాడతామని పేర్కొన్నారు. సిజెపి అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా బృందం ఈ నెల 17న హఫీజ్ కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు ప్రకటించారు.

​బిజెపి కార్యకర్తలని ఎఫ్‌ఐఆర్‌‌లో లేదు : సిఎం

తీవ్ర విమర్శలు రావడంతో ఈ ఘటనలో బిజెపి కార్యకర్తలెవరూ పాల్గొనలేదని, ఎఫ్‌ఐఆర్‌‌లో ఎక్కడా బిజెపి కార్యకర్తలుగా పేర్కొనలేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి అన్నారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశామని, మిగిలిన వారిని అరెస్టు చేస్తామని మీడియాకు చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్