మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గర్బా పందిరి వద్ద 15 ఏళ్ల బాలికను తోసేసి, దురుసుగా ప్రవర్తించిన ఘటనలో బీజేపీ మండలాధ్యక్షుడు కమల్ చౌహాన్‌పై పోలీసులు పోక్సో చట్టంతో పాటు బీఎన్ఎస్ సెక్షన్ 74 కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 15న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 17న కేసు నమోదు చేసి, బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదు. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ, కమల్ చౌహాన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది.
అక్టోబర్ 15వ తేదీ రాత్రి ఇండోర్‌లోని హీరా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకేశ్వరి గర్బా పందిరికి ఓ 15 ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి వచ్చింది. పాస్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా అక్కడ నిర్వాహకుడిగా ఉన్న బీజేపీ మండలాధ్యక్షుడు కమల్ చౌహాన్‌కు, బాలిక కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన చౌహాన్.. బారికేడ్ దాటి వచ్చి బాలికను చేతితో పట్టుకుని పలుమార్లు వెనక్కి తోసేశారు. ‘ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని ఆయన అరుస్తుండగా, ఆ బాలిక ‘నన్ను ముట్టుకోవద్దు, ఇది సరైన పద్ధతి కాదు’ అని ప్రతిఘటించడం వీడియోలో స్పష్టంగా రికార్డయింది.







కామెంట్లు (0)