యువత గుండెల్లో 'రౌడీ బాయ్'గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ రణబాలిగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన నటించిన మోస్ట్ ఎవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘‘రణబాలి’’ ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రాయలసీమ గడ్డపై బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా సాగిన పోరాట నేపథ్యంలో సాగిన కథ. బ్రిటీష్ కలెక్టర్ల అరాచకాలు, కరువు పీడనకు గురవుతున్న తన ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడిగా విజయ్ దేవరకొండ ‘సింగనమల బొబ్బిలి రణబాలి’ పాత్రలో జీవించారు. అన్యాయాన్ని ప్రశ్నించే పోరాట యోధుడిగా విజయ్ ప్రదర్శించిన ఆహార్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ‘రణబాలి’ విజయ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో జన్మించిన విజయ్ దేవరకొండ బాల్యం సాధారణ మధ్యతరగతి కుటుంబ వాతావరణంలో గడిచింది. తండ్రి గోవర్ధన్‌రావు టెలివిజన్ రంగంలో దర్శకుడిగా పనిచేశారు. తల్లి మాధవి. తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. కుటుంబంలో సినిమా రంగం గురించి కొంత పరిచయం ఉన్నప్పటికీ, విజయ్‌కు చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. తండ్రికి నటన, సినిమా రంగంపై ఆసక్తి ఉండేది. అయితే ఆయన ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు.

కుటుంబం కోసం
తండ్రి అనుభవమే విజయ్ నటనను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల్లో ఆందోళనకు కారణమైంది. కానీ విజయ్ మాత్రం పట్టుదలగా ప్రయత్నాలు చేశారు. తాను నటుడిగా ఎదగాలనే కోరిక బలంగా ఉండేది. తన కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ, తల్లిదండ్రుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే కోరిక తనను ముందుకు నడిపించిందని ఆయన పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. విజయ్ పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. తర్వాత హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. బద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్‌లో బీకాం చదివారు. విద్యార్థిగా చదువులో మంచి ప్రతిభ చూపిన విజయ్, నటనపై ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. కాలేజీ రోజుల్లో నాటకాలు, రంగస్థల అనుభవం ఆయనలోని నటుడికి పునాది వేశాయి. చదువు పూర్తయ్యాక నటననే తన భవిష్యత్తుగా మలచుకోవాలని నిర్ణయించుకున్నారు.
రంగస్థల అనుభవాలు!
విద్యార్ధిదశ నుంచే రంగస్థలంపై పనిచేయడం విజయ్‌కు ఉపయోగపడింది. నటనలోని మెళకువలను తెలుసుకోవడానికి, పాత్రను అర్థం చేసుకోవడానికి, ప్రేక్షకుల ముందు భావాలను వ్యక్తం చేయడానికి నాటకాలు ఒక వేదికగా నిలిచాయి. నటనను కేవలం కెమెరా ముందు చేసే పనిగా కాకుండా, నేర్చుకోవాల్సిన కళగా చూడటానికి ఈ అనుభవాలు తోడ్పడ్డాయి. 2011లో విడుదలైన ‘నువ్విలా’ సినిమాతో విజయ్ నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో సైడ్ క్యారెక్టర్‌గా నటించారు. ఈ సినిమాలు ఆయనకు నటుడిగా పరిచయాన్ని ఇచ్చినా, ప్రేక్షకుల్లో పెద్ద స్థాయిలో గుర్తింపును తీసుకురాలేదు. ఒకవైపు తనకు ఇష్టమైన నటన.. మరోవైపు భవిష్యత్తుపై అనిశ్చితి. ఈ రెండింటి మధ్య తన నిర్ణయంపై నిలబడటం విజయ్‌కు సులభం కాలేదు. అయినా నటుడిగా ఎదగాలనే ప్రయత్నాన్ని కొనసాగించారు. కెరీర్ మొదట్లో ఎదురైన ఈ విరామమే ఆయన ప్రయాణంలో ముఖ్యమైన దశగా నిలిచింది.
‘పెళ్లిచూపులు’తో వచ్చిన గుర్తింపు!
నాని హీరోగా నటించిన ‘‘ఎవడే సుబ్రమణ్యం’’ సినిమాలో విజయ్ కు మంచిపాత్రలో నటించే అవకాశం వచ్చింది. అది విజయ్ కెరీర్లో గుర్తించదగిన మలుపు. విజయ్ పోషించిన ‘‘రిషి’’ పాత్ర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కథానాయకుడి స్నేహితుడిగా కనిపించినా, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత కుటుంబ సభ్యుల్లోనూ ఆయన నటనపై నమ్మకం పెరిగిందని విజయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2016లో విడుదలైన ‘‘పెళ్లిచూపులు’’ విజయ్ దేవరకొండ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నిరుద్యోగ యువకుడిగా, తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకోవాలనుకునే వ్యక్తిగా విజయ్ కనిపించారు. పెద్దగా ఆర్భాటం లేకుండా, సాధారణ యువకుడిలా తెరపై కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సినిమా విజయం విజయ్‌కు నటుడిగా మరింత గుర్తింపును తీసుకొచ్చింది. నటనలోని సహజత్వం, పాత్రకు తగ్గట్టుగా మారగల సామర్థ్యం ఆయనలో ఉన్నాయని నిరూపించుకోవడానికి అవకాశం కల్పించింది.

‘అర్జున్‌రెడ్డి’తో సంచలనం!
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 2017లో వచ్చిన ‘‘అర్జున్‌రెడ్డి’’ విజయ్ దేవరకొండ సినీ ప్రయాణంలో అత్యంత కీలకమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ పోషించిన అర్జున్ రెడ్డి పాత్ర తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద హిట్ గా నిలిచింది. ప్రేమ, కోపం, అహంకారం, భావోద్వేగాల మధ్య కొట్టుమిట్టాడే యువ వైద్యుడిగా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయ్ను యువతలో విపరీతమైన గుర్తింపు ఉన్న నటుడిగా మార్చింది.
ఆరు నెలల కష్టం..
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ‘‘రణబాలి’’ సినిమా 19వ శతాబ్దంలో (1854-1878) రాయలసీమ నేపథ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో హీరో విజయ్ ఒక నటుడిగానే కాకుండా, ఆ నాటి వీరుడి భావోద్వేగాలను, రౌద్ర రసాన్ని తన నటనతో తెరపై ఆవిష్కరించిన తీరు ఆద్యంతం అద్భుతంగా ఉందని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న 'జయమ్మ' పాత్రలో కనిపించారు. పోరాటంతో పాటు ప్రేమ, ఎమోషన్, కుటుంబ బాధ్యతలు కలగలిసిన కథనంతో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ‘‘ఈ సినిమా కోసం ఆరు నెలలు కష్టపడ్డాము. గుర్రంస్వారీ నేర్చుకున్నాను. శారీరకంగానే కాదు.. ‘రణబాలి’ కథ, దాని నేపథ్యంపైనా అధ్యయనం చేశాను. ‘‘రణబాలి’’ స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించిన కథ కాదు. తన ఊరికి వచ్చి దోచుకుంటున్న బ్రిటిష్ వాళ్లపై ఓ యోధుడు చేసే పోరాటం. కరువు వల్ల రాయలసీమలో కొన్ని లక్షల మంది చనిపోయారు. అనేకమంది నల్లమట్టి తిని బతికేవారట. అలాంటి పరిస్థితుల్లోనూ బ్రిటిష్ వాళ్ల ఆగడాలు ఆగలేదు. అత్యంత దారుణమైన ఘటనలను ఈ సినిమా చర్చిస్తుంది. ఆద్యంతం ఆలోచింపజేస్తుంది. భావోద్వేగానికి గురి చేస్తుంది’’ అని విజయ్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
పూర్తి పేరు: దేవరకొండ విజయ్ సాయి
పుట్టిన తేదీ: 9 మే 1989
అవార్డులు: నంది అవార్డు(2015) – స్పెషల్ జ్యూరీ(ఎవడే సుబ్రహ్మణ్యం), జీ గోల్డెన్ అవార్డు ఉత్తమ నటుడు – అర్జున్ రెడ్డి(2017), ఫిల్మ్‌ఫేర్ అవార్డు (సౌత్) ఉత్తమ నటుడు – తెలుగు, అర్జున్ రెడ్డి(2018)- సైమా (SIIMA) ఉత్తమ నటుడు – క్రిటిక్స్.







కామెంట్లు (0)