- రాజస్థాన్‌లో విద్యార్థుల అవస్థలు
జైపూర్: పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది.. ఎప్పుడు కూలుతుందో తెలియదు. హైకోర్టు ఆదేశాలతో ప్రమాదకరమైన భవనాలను మూసివేశారు. కానీ విద్యార్థులకు ప్రత్యామ్నాయ తరగతి గదులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో చిన్నారులు గోశాలలో చదువుకోవాల్సిన దుస్థితి రాజస్థాన్‌లో నెలకొంది. ప్రతిరోజూ ఉదయం 6.45 గంటలకే విద్యార్థులు పుస్తకాల సంచులతో గోశాలకు చేరుకుంటారు. అక్కడి మట్టిని తవ్వి చదును చేసి, చాపలు పరిచి, బ్లాక్‌బోర్డును ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత అదే వారి తరగతి గదిగా మారుతుంది. పాఠాలు చెప్పాల్సిన చోట.. గోశాల ఆవరణలోనే విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
నీరు లేదు.. మరుగుదొడ్లు లేవు
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ తరగతి గదిలో కనీస వసతులు కూడా లేవు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు అందుబాటులో లేవు. ముఖ్యంగా బాలికలు, ఉపాధ్యాయులు తమ ప్రాథమిక అవసరాల కోసం సమీప గ్రామస్థులపై ఆధారపడాల్సి వస్తోంది.
లాల్‌చంద్ అనే గ్రామస్థుడు విద్యార్థుల కోసం తన భూమిని ఉచితంగా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని కూడా వెంటనే ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు ఇక ఎక్కడ చదువుకోవాలన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఏడుగురు చిన్నారుల మృతితో ఆదేశాలు
గత ఏడాది ఝల్వార్ జిల్లా పిపలోడిలో పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తర్వాత ప్రమాదకరమైన పాఠశాల భవనాల్లో తరగతులు నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రమాదకర భవనాలను మూసివేసినప్పటికీ, వాటికి ప్రత్యామ్నాయంగా అవసరమైన తరగతి గదులను ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి.
5,667 పాఠశాల భవనాలు ప్రమాదకరం
విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన సర్వే రాష్ట్రంలోని పాఠశాలల దుస్థితిని వెల్లడించింది. రాజస్థాన్‌లో మొత్తం 63,018 పాఠశాలలు ఉండగా.. వాటిలో 5,667 పాఠశాల భవనాలు కూలిపోయే ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 1,579 భవనాలు పూర్తిగా ప్రమాదకర స్థితిలో ఉన్నాయని తేలింది. శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల సంఖ్య ఏకంగా 86,934గా ఉంది. ప్రమాదకర భవనాలు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో బన్స్వారా 605 భవనాలతో మొదటి స్థానంలో ఉండగా, ఉదయ్‌పూర్‌లో 563, జైపూర్‌లో 185 భవనాలు ఉన్నాయి.
రూ.12,335 కోట్లతో ఐదేళ్ల ప్రణాళిక
పాఠశాల భవనాల మరమ్మతులు, పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం ఐదేళ్ల ప్రణాళికను హైకోర్టుకు సమర్పించింది. ఈ ప్రణాళిక అమలుకు సుమారు రూ.12,335 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఈ ప్రణాళికలో శిథిలావస్థలో ఉన్న 3,587 పాఠశాలలకు కొత్త భవనాల నిర్మాణం కోసం రూ.2,487 కోట్లు, 22,589 భవనాల మరమ్మతులకు రూ.1,129 కోట్లు, 83,783 కొత్త తరగతి గదుల నిర్మాణానికి రూ.8,378 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. అయితే ఈ భారీ ప్రణాళికకు అవసరమైన నిధులను సమకూర్చడం ప్రభుత్వానికి ప్రధాన సవాలుగా మారింది.
కెమెరాలపై ఆంక్షల ఆరోపణలు
పాఠశాలల దయనీయ పరిస్థితులు బయటకు రాకుండా విద్యాశాఖ కెమెరాలు, బయటి వ్యక్తుల ప్రవేశంపై ఆంక్షలు విధించిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్‌ను ప్రశ్నించగా, ప్రతి విభాగానికి దాని సొంత నియమాలు ఉంటాయని సంక్షిప్తంగా సమాధానమిచ్చారు.
పిల్లలు తరగతి గదుల్లో కూర్చొని పాఠాలు నేర్చుకోవాల్సిన సమయంలో.. గోశాలల్లో చాపలు పరుచుకుని చదువుకోవాల్సిన పరిస్థితి రావడం రాజస్థాన్‌లో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది.








కామెంట్‌లు (0)