- ఉపాధి కోల్పోయిన దాదాపు 800మంది ఉద్యోగులు
- సిఐటియు, డివైఎఫ్‌ఐ జోక్యంతో తెరుచుకున్న గేట్లు
కోచి, కొజికోడ్ : అమెరికాకు చెందిన ఆరోగ్య సంరక్షణ సంస్థ కోరో హెల్త్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కేరళలో తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించడంతో సోమవారం కోచి, కొజికోడ్‌ల్లోని కంపెనీ కార్యాలయాల్లోకి రాకుండా వర్కర్లను అడ్డుకున్నారు. కంపెనీ నిర్ణయంతో ఎలాంటి ముందస్తు నోటీసుల్లేకుండా దాదాపు 800మంది ఉద్యోగులు తొలగింపును ఎదుర్కొంటున్నారు. కంపెనీ చర్యలతో చట్టపరమైన నిబంధనల పాటింపునకు సంబంధించి వివాదం తలెత్తింది. కాగా కంపెనీ నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోచి కార్యాలయం వద్ద డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి, మట్టనూర్ ఎంఎల్‌ఎ వి.కె.సనోజ్, సిఐటియు నేతలు నిరసన చేపట్టారు. కోజికోడ్‌లో డివైఎఫ్‌ఐ మాజీ జాతీయ అధ్యక్షుడు, బేపోర్ సిట్టింగ్ ఎంఎల్‌ఎ పి.ఎ.మహ్మద్ రియాజ్ కంపెనీ కార్యాలయానికి వచ్చి అక్కడ నిరసన తెలుపుతున్న కార్మకులతో మాట్లాడి వారికి సంఘీభావం తెలిపారు. వారి జోక్యంతో భద్రతా సిబ్బంది ఆఫీసు గేట్లను తెరిచారు. ఉద్యోగులను కంపెనీ ఆవరణలోకి అనుమతించారు. ‘ఉదయం 8గంటల నుండి ఉద్యోగులు ఇక్కడ వేచి వున్నారు. కార్మిక చట్టాల ప్రకారం అనుసరించాల్సిన ఎలాంటి పద్దతులు, ప్రక్రియ లేకుండానే యాజమాన్యం వారిని తొలగించింది. వారి కార్యాలయాలను ఖాళీ చేయించింది.’ అని సనోజ్ పేర్కొన్నారు.
కోచి (600), కొజికోడ్ (200)ల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తూ శుక్రవారం (జులై 3)కంపెనీ నిర్ణయించిన నేపథ్యంలో పై పరిణామాలు చోటు చేసుకున్నాయి. కంపెనీ వ్యాపార సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అందువల్ల తక్షణమే అమల్లోకి వచ్చేలా కేరళలో కంపెనీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని ఆఫీసు పని వేళల్లో ఉద్యోగులకు తెలియచేశారు. ఉద్యోగులు తమ పని తాము చేసుకుంటుండగా మాత్రమే ఈ నిర్ణయం తెలియచేశారని ఫౌసియా షామ్స్ అనే ఉద్యోగి ఆదివారం విలేకర్లకు తెలిపారు. ‘‘ఆఫీసులో పని చేసుకుంటుండగా ఈ ప్రకటన చేశారు. వెంటనే పని ఆపేయాలని, ల్యాప్‌టాప్‌లు మూసివేయాలని, కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోవాలని ఆదేశించారు. ఎవరికైనా ఏవైనా ప్రశ్నలుంటే అడగవచ్చని యాజమాన్యం చెప్పింది మా ఆందోళనలు పరిష్కరిస్తామని తెలిపింది. కానీ ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేదు.’’ అని ఆమె పేర్కొన్నారు.
దాంతో ఉద్యోగులు కార్మిక శాఖ అధికారులను ఆశ్రయించారు. వారు శుక్రవారం కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. మాజీ కార్మిక శాఖ మంత్రి వి.శివన్‌కుట్టీ, త్రిక్కర ఎంఎల్‌ఎ ఉమా థామస్, ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి బిందూ కృష్ణ కూడా ఇందులో జోక్యం చేసుకోవాలని ఉద్యోగులు కోరారు. చర్చల అనంతరం ప్రస్తుతానికి యథాతధ స్థితిని పాటించాలని, సోమవారం నుండి కర్యాకలాపాలను పునరుద్ధరించాలని కార్మిక శాఖ ఒక అవగాహనను కుదిర్చింది. అయితే యాజమాన్యం ఈ అవగాహనను ఉల్లంఘించి ఏకపక్షంగా ఉద్యోగులకు పదవీ విరమణ చెల్లింపులు జారీ చేసింది. ఈ దిశగా దాదాపు రూ.12కోట్లు కంపెనీ పంపిణీ చేసినట్లు అంచనా వేశారు.
సోమవారం డివైఎఫ్‌ఐ, సిఐటియు నేతల జోక్యం తర్వాత మరోసారి చర్చలు జరిగాయి. రాజీ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ప్రస్తుత ఏర్పాటును అమలు చేయాలని కార్మిక శాఖ అధికారులు కోరారు. వివాదాన్ని పరిష్కరించడానికి తదుపరిచర్చలు జరుగుతాయని భావిస్తున్నారు.








కామెంట్‌లు (0)