బీహార్‌లో అమలుకు జెడియు నో
రాజ్యాంగ విరుద్దం : సిపిఎం
అమిత్ షా ప్రకటన మేరకే నడుచుకుంటాం: టిడిపి
ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ : కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2029 లోక్‌సభ ఎన్నికలలోపు ఎన్‌డిఎ పాలిత 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి)ని అమలు చేస్తామని ప్రకటించిన మరుసటి రోజే, కూటమిలో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రధాన మిత్రపక్షం నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) బీహార్‌లో దీన్ని అమలు చేసేది లేదని తేల్చిచెప్పింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బిజెపి వైఖరిని ఖండించారు. దొడ్డిదారిన యుసిసిa అమలుకు యత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ మాత్రం దీనికి భిన్నమైన వైఖరి తీసుకుంది. ఒకప్పుడు లౌకిక విలువలకు కట్టుబడుతామని, యుసిసి విషయంలో మైనార్టీలకు నష్టం చేసే చట్టాలను ఆమోదించమని చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు అమిత్‌షా ప్రకటనను స్వాగతించింది. ఆ ప్రకటన ప్రకారం నడుచుకుంటామని తెలిపింది.
బీహార్‌లో వద్దు: జెడియు స్పష్టీకరణ
ఎన్‌డిఎ ప్రధాన మిత్రపక్షం జెడియు నేత, మాజీ మంత్రి శ్యాం రజక్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని, కానీ బీహార్‌లో మాత్రం అమలుకు ససేమిరా ఒప్పుకోబోమని చెప్పారు. పార్లమెంటులో ఈ బిల్లు వచ్చినప్పుడు తమ నేత నితీష్ కుమార్ స్పష్టంగా ఇదే మాట చెప్పారని ఆయన గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా విస్తృత ఏకాభిప్రాయం కుదిరాకే యుసిసి అమలు చేయాలన్నది నితీష్ కుమార్ ఎప్పటినుంచో చెబుతున్న వాదన. జెడియు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ ఝా మాట్లాడుతూ, ఈ అంశాన్ని బిజెపి జాతీయ నాయకత్వంతో చర్చిస్తామని, హోంమంత్రితో మాట్లాడతామని తెలిపారు. బిహార్‌లోని మరో మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఎల్‌జెపి(ఆర్‌వి) బహిరంగంగా మద్దతు ఇవ్వడానికి నిరాకరించింది. ఆ పార్టీ అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ, తమ పార్టీ సమానత్వం, వైవిధ్యానికి కట్టుబడి ఉందని, ముసాయిదా బిల్లు వచ్చాక దాని ప్రభావాన్ని, న్యాయపరమైన అంశాలను అంచనా వేస్తామన్నారు.
పార్లమెంట్‌లో చర్చించండి : ఒమర్ అబ్దుల్లా
యుసిసి ప్రకటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ప్రకటన విడుదల చేసిన ఆయన, బిజెపి యుసిసిని పార్లమెంటులో చట్టం చేయాల్సింది పోయి, రాష్ట్రాల ద్వారా దొడ్డిదారిన అమలు చేయడానికి యత్నిస్తోందని విమర్శించారు. ‘‘పార్లమెంట్‌లో తగిన సంఖ్యాబలం ఉన్నప్పుడు ఎందుకు అక్కడ చర్చించడం లేదు?’’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎన్‌డిఎ పక్షాలు కూడా యుసిసిని వ్యతిరేకిస్తున్నాయని, జెడియు బిహార్‌లో అమలును వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బిజెపి సొంత మిత్రపక్షాలే దీనికి సిద్ధంగా లేనప్పుడు, దేశమంతటా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో మాత్రమే అమలైతే దాన్ని ‘‘సార్వత్రికం’’ అని అనలేమని, ఇలాంటి కీలక అంశాన్ని జాతీయ స్థాయిలో పార్లమెంటు ద్వారానే నిర్ణయించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో, వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) వద్ద ఉద్రిక్తతలు తగ్గడాన్ని ఆయన స్వాగతించారు. చైనా భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించడంపై స్పందిస్తూ, భారత విదేశాంగ విధానం ఎప్పుడూ స్వతంత్రమైనదని, ఇతర దేశాల ధృవీకరణ అవసరం లేదని పేర్కొన్నారు.
టిడిపి యు టర్న్!
గతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మైనార్టీలకు నష్టం చేసే చట్టాలను ఆమోదించ బోమని, యుసిసి విషయంలో తాము మైనార్టీల పక్షానే ఉంటామని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. టిడిపి రాష్ర్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా ప్రకటనకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అంతే కాదు, యుసిసి దేశ ఐక్యతను బలపరుస్తుందని తెలిపారు. దేశం సాంస్కృతికంగా విభిన్నమైనదని, యుసిసి దేశాన్ని బలోపేతం చేసి, ఏకం చేస్తుందంటూ ఆయన అన్నారు. ఎన్‌డిఎ భాగస్వాములుగా హోం మంత్రి ప్రకటన ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. అలాగే, టిడిపి ఎంపి లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ ప్రస్తుతానికి దీనిపై చర్చ జరగలేదని, అన్ని పక్షాలను భాగస్వాములను చేసి ముందుకు వెళ్తామన్నారు. టిడిపితో పాటు శివసేన(ఎకనాథ్ షిండే), హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) కూడా మద్దతు ప్రకటించాయి.
మతతత్వ రాజకీయాల కోసమే యుసిసి : సిపిఎం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 2029 లోక్‌సభ ఎన్నికలలోపు ఎన్‌డిఎ పాలిత మొత్తం 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి)ని అమలు చేస్తామని ప్రకటించడంపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రకటన వెనుక బిజెపి రాజకీయ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ విమర్శించింది. ‘‘ఇది మహిళా హక్కుల కోసం చేస్తున్నది ఎంత మాత్రం కాదు. సమాన హక్కులకు సంబంధించిన సంక్లిష్టమైన అంశాన్ని బిజెపి ఆయుధంగా మలుచుకుని, రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ హిందుత్వ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకునేందుకు దీన్ని మతతత్వ, మెజారిటీ రాజకీయాల సాధనంగా వాడుకుంటోంది’’ అని సిపిఎం తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా విమర్శించింది. ఏకరూపత అంటే సమానత్వం కాదని పార్టీ స్పష్టం చేసింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, విద్యార్థుల సమస్యలు వంటి తక్షణ, కీలక అంశాలను పరిష్కరించాల్సి ఉండగా, వాటిని విస్మరించి బిజెపి మరో విభజన రాజకీయ ప్రచారానికి తెరతీసిందని ఆరోపించింది. ‘‘రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ చర్యను మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రతి అడుగులోనూ దీన్ని ప్రతిఘటిస్తాం’’ అని సిపిఎం స్పష్టం చేసింది.
ప్రజల దృష్టి మళ్లించేందుకే : కాంగ్రెస్ ఎంపి ఇమ్రాన్ ప్రతాప్ గర్హి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి మాట్లాడుతూ, ‘‘విద్యార్థుల నిరసనలతో కలవరపడిన ప్రభుత్వానికి ఇలాంటి ఎత్తుగడ వేయడం తప్ప మరో మార్గం లేదు... వారు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారు, విద్యార్థులు తీవ్ర నిరాశతో నిరసనలు చేస్తున్నారు; ఫలితంగా, అసలు సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వానికి ఉన్న ఏకైక వ్యూహం ఇదే. భారతదేశం వైవిధ్యాల గడ్డ. ఇది ఎన్నో విభిన్న సంస్కృతుల్లో నిండి ఉంది. అయినా, బిజెపి ప్రతీదానికీ ఒకే రంగు పూసి, అన్నింటినీ ఏకరీతిగా మార్చాలని చూస్తుంది.’’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన మూడు నెలలకే అమిత్ షా ఈ ప్రకటన చేయడం విశేషం. గతంలో యుసిసిని తీవ్రంగా వ్యతిరేకించిన టిఎంసి ప్రభుత్వం స్థానంలో ఇప్పుడు బిజెపి అధికారంలో ఉంది. బెంగాల్ బిజెపి అధ్యక్షుడు శమీక్ భట్టాచార్య మాట్లాడుతూ, యుసిసి అమలును వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని, ఇది బిజెపి ప్రాధాన్యతల్లో ఒకటని స్పష్టం చేశారు. అయితే టిఎంసి నుంచి విడిపోయిన ఎంపిలతో ఏర్పడిన బిజెపి కొత్త మిత్రపక్షం నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సిపిఐ) మాత్రం, ఈ అంశంపై లోతుగా చర్చించాల్సి ఉందని తెలిపింది, ప్రతిపాదన వచ్చాకే నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేత కకోలి ఘోష్ దస్తీదార్ తెలిపారు. లోక్‌సభలో టిడిపికి-16, శివసేనకు-13, జెడియుకు-12, ఎల్‌జెపి(ఆర్‌వి)కి-5, హెచ్ఎఎం(ఎస్)కి-1 ఎంపి స్థానాలున్నాయి.







కామెంట్‌లు (0)