ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘వెట్రిపయనం’పై రిట్‌ పిటిషన్‌.. సోమవారం విచారణ

1 గంట క్రితం

Vettri Payanam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 03:11 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

చెన్నై : తమిళనాడులోని ‘వెట్రిపయనం’ పథకం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్‌పై సోమవారం మద్రాస్‌ హైకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుశ్రత్‌ అరవింద్‌, జస్టిస్‌ జి.అరుల్‌ మురుగన్‌లతో కూడిన మొదటి డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారణ చేపట్టనుంది. ఈ పథకంతో ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టర్స్‌ తీవ్రంగా నష్టపోతారని, భారీ నష్టాలు వాటిల్లుతాయని, తమ వ్యాపారం మూసివేయడం తప్ప మరో మార్గం ఉండదని ఫిర్యాదు చేస్తూ ఈరోడ్‌ జిల్లాలోని భవానీ తాలూకాకు చెందిన ప్రైవేట్‌ బస్సు ఆపరేటర్‌ ఎన్‌.కలామణి కోర్టును ఆశ్రయించారు. మహిళలతో పాటు పురుష ప్రయాణికులు కూడా తమ బస్సులను ఎక్కరని వాదించారు. మహిళలకు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో కుటుంబమంతా కలిసి వెళ్లేందుకు ప్రభుత్వ బస్సులను ఎంపిక చేసుకుంటారని పేర్కొన్నారు.

తాను వితంతువునని, తనపై ఇద్దరు కుమార్తెల బాధ్యత ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈరోడ్‌ నుండి వెల్లితిరుప్పూర్‌ వరకు 47 కి.మీ మార్గంలోనూ, కాకపాళయం నుండి అంధియూర్‌ వరకు 88 కి.మీ మార్గంలోనూ బస్సులు నడిపేందుకు తనకు అనుమతి ఉందని తెలిపారు. సుమారు 15మంది తన ట్రావెల్స్‌లో పనిచేస్తున్నారని, వారి కుటుంబాలు కూడా తన ట్రావెల్స్‌ పైనే ఆధారపడి ఉన్నాయని అన్నారు. ఈ మార్గల్లో గణనీయ సంఖ్యలో ప్రభుత్వ బస్సులు నడుస్తుండటంతో.. ప్రైవేట్‌ బస్సుల్లో ప్రయాణించేందుకు ఎవరూ ముందుకు రారేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘వెట్రి పయనం’ పథకం అమలు కోసం ఏటా రూ.6,000 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించేందుకు ముందుకొచ్చిందని, ప్రభుత్వ రవాణా సంస్థలకు ఈ పథకం వల్ల కలిగే ఆదాయ నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేస్తోందని వివరించారు. అయితే, ఈ పథకాన్ని ప్రైవేటు బస్సు ఆపరేటర్లకూ వర్తింపజేయాలని కోరుతూ తమిళనాడు బస్సు ఆపరేటర్ల సంఘాల సమాఖ్య 2026 జులై 22న ముఖ్యమంత్రి విజయ్‌కు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదని పేర్కొన్నారు.

ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి, ప్రైవేటు బస్సులకు ఆ వెసులుబాటు కల్పించకపోవడం రవాణా రంగంలో సమాన పోటీ వాతావరణానికి విరుద్ధమని కలామణి పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14లో పొందుపరిచిన సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.గత డిఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘విడియల్ పయనం’ పథకానికి ‘వెట్రి పయనం’ విస్తరణ రూపమే అయినప్పటికీ, పాత పథకం ప్రైవేటు రవాణా ఆపరేటర్లపై పెద్దగా ప్రభావం చూపలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేయడం తప్పనిసరని మోటారు వాహనాల చట్టం-1988, తమిళనాడు మోటారు వాహనాల నిబంధనలు-1989లోని నిబంధనలను ఉటంకించారు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయకుండా, అసెంబ్లీలో రూల్‌ 110 కింద ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆధారంగా పథకాన్ని అమలు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 161కు విరుద్ధమని వాదించారు. 2026, ఆగస్టు 24న సమాచార, ప్రజా సంబంధాల శాఖ (డిఐపిఆర్‌) ద్వారా వెలువడిన ప్రకటనను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని, పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడే వరకు దానిపై మధ్యంతర స్టే విధించాలని కోర్టును కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్