సిజెపికి మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు
విదేశాల్లోనూ సంఘీభావ ప్రదర్శనలు
పాట్నాలో పోలీసుల లాఠీచార్జి
న్యూఢిల్లీ : విద్యా రంగంలో అక్రమాలను ప్రశ్నిస్తూ సంస్కరణల కోసం డిమాండ్ చేస్తూ విద్యార్ధి లోకం దేశరాజధాని న్యూఢిల్లీలో చేపట్టిన ఆందోళనలు క్రమేపి దేశం నలుమూలలకూ విస్తరిస్తున్నాయి. జమ్ముకాశ్మీర్‌లోని లడఖ్ మొదలు కన్యాకుమారి వరకు, ఇండోర్ నుండి డెహ్రాడూన్ వరకు, ముంబయి, హైదరాబాద్ ఇలా ప్రతీ చోటా విద్యార్ధులు ముందుకు వచ్చారు. తమ మద్దతును ప్రకటించారు. లండన్ వంటి విదేశీ నగరాల్లోనూ సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించారు.
మంగళవారం వివిధ ప్రాంతాల్లో విద్యార్ధులు తమ నిరసనలను, ఆందోళనలను తెలియచేస్తూ ప్రదర్శనలు సాగించారు. ఢిల్లీ నడివీధుల్లో విద్యార్ధులపై దమనకాండను నిరసిస్తూ వందల సంఖ్యలో విద్యార్ధులు కార్గిల్ వీధుల్లో కదం తొక్కారు. ‘సేవ్ మెరిట్, సేవ్ స్టూడెంట్స్, సేవ్ ది నేషన్’ అంటూ నినాదాలు రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. లేహ్‌లోని ప్రధాన మార్కెట్‌లో కొవ్వొతులతో ప్రదర్శన చేపట్టారు. ‘సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా మేమూ’ అంటూ నినదించారు. నిరసన, ఆందోళన ప్రశాంతంగా, ప్రజాస్వామ్య యుతంగా జరగాలని కార్గిల్‌లోని లడఖ్ విద్యార్ధి సంఘ అధ్యక్షుడు అరిఫ్ అలీ పిలుపిచ్చారు. ఇలా నినాదాలు, సంఘీభావ ఆందోళనలు ప్రయాణిం చాయి. బ్రిటన్‌కు చేరుకున్నాయి. ఎడన్‌బరో, గ్లాస్గో, మాంచెస్టర్, లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయం వెలుపల ఇలా పలుచోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఎస్‌ఎఫ్‌ఐ-యుకె ఆధ్వర్యంలో ఈ నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ ర్యాలీలకు వందలు వేల సంఖ్యలో భారతీయ విద్యార్ధులు, లెఫ్ట్ వింగ్ గ్రూపులకు చెందినవారు హాజరయ్యారు. జవాబు దారీతో కూడిన, న్యాయమైన, సక్రమమైన, పారదర్శ కతతో కూడిన విద్యా విధానం కావాలని వారు నినదించారు. శాంతియుతంగా నిరసన తెలియచేసే విద్యార్థుల హక్కుకు మద్దతిచ్చారు. గత మూడు రోజులుగా ముంబయిలో సాగుతున్న సిజెపి నిరసనల్లో దాదాపు 900మందిపై అభియోగాలు మోపారు. 8 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువమంది 20నుండి 24ఏళ్ళ విద్యార్ధులే. మంగళవారం వాట్సాప్ ద్వారా తమకు పోలీసుల నోటీసులు అందాయని నిరసనకారులు తెలియచే శారు. ఆదివారం నుండి ఊపందుకున్న విద్యార్ధుల ఆందోళనలు, ప్రదర్శనలు ప్లకార్డులు, నినాదాలతో సాగుతున్నాయి. ఇండోర్‌లో వెయ్యి మందికి పైగా విద్యార్ధులు తాంతియా భిల్ విగ్రహం వద్దకు చేరి ఢిల్లీలోని నిరసనకారులకు మద్దతును ప్రకటించారు. వీరితో పాటు టీచర్లు, తల్లిదండ్రులు, సామాన్యులు కూడా వున్నారు. ఆందోళన జరుపుతున్న వారికి ఆహారాన్ని తీసుకువచ్చిన అనంతరం సాక్షి బహేరియా మాట్లాడుతూ, కేవలం కొద్ది మంది విద్యార్ధులతో ప్రారంభమైన ఆందోళన నేడు ఉద్యమంగా మారింది. సక్రమమైన పరీక్షా వ్యవస్థను కావాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ సంబంధించినదే ఈ ఉద్యమం అని వ్యాఖ్యానించారు. డెహ్రాడూన్ వీధుల్లోకి వందలమంది విద్యార్ధులు వచ్చారు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్‌లో పెండింగ్‌లో వున్న రిక్రూట్‌మెంట్ పరీక్షలు, ఫలితాల సమస్యను పరిష్కరించాలన్నారు. విద్యార్ధుల ప్రదర్శ నను సెక్రటేరియట్ వద్దే పోలీసులు ఆపడం ఘర్షణ లకు దారి తీసింది. అనుమతి లేకుండా ప్రదర్శన చేసినందుకు వదోదరలో 9మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఎఐఎస్‌ఎఫ్‌కు చెందిన అనేకమందిని పోలీసులు నిర్బంధిం చారు. ఢిల్లీలో సిజెపి ఆందోళనకారులపై పోలీసుల దాష్టికాలకు నిరసనగా వారు ప్రదర్శన చేపట్టారు.
పాట్నాలో పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దృశ్యాలే పాట్నాలో కూడా చోటు చేసుకున్నాయి. పాట్నాలోని జెపి గోలంబర్ వద్ద బుధవారం హింసాత్మక ఘర్షణలు తలెత్తాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐఎస్‌ఎ) ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌కు ప్రదర్శనగా వెళుతున్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి జరిపారు. బాష్పవాయు గోళాలను, జల ఫిరంగులను ప్రయోగించారు. ప్రదర్శనకారులను అడ్డుకోవడానికి పోలీసులు పలుచోట్ల బారికేడ్లు పెట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ఎంతలా ప్రయత్నించినా కొంతమంది ముందుకు దూసుకెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అనేకమంది విద్యార్ధులు రోడ్డుపైనే బైఠాయించారు. చివరకు సీనియర్ పోలీసు అధికారుల జోక్యంతో విద్యార్ధులను అక్కడ నుండి పంపారు. ఢిల్లీలో కూడా ఇంకా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి.







కామెంట్‌లు (0)