బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

18 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియాపై ఆంక్షలు వార్త ఫేక్‌

1 గంట క్రితం

social media
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 12:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : 18 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందంటూ వచ్చిన వార్తా కథనాలు నకిలీవని ప్రభుత్వ వర్గాలు బుధవారం స్పష్టం చేశాయి. ఈ వార్తలకు ఎలాంటి ఆధారం లేదని పేర్కొన్నాయి. అయితే మైనర్లకు సంబంధించిన భారతీయ చట్టాలను సోషల్‌ మీడియా, ఇతర డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా పాటించేలా చట్టపరమైన నిబంధనలను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని కోరింది. 18 ఏళ్లలోపు వారు స్వతంత్రంగా చట్టబద్ధమైన ఒప్పందాలు చేసుకోవడానికి అర్హులు కానప్పటికీ, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో స్వయంగా ఖాతాలు సృష్టించుకుని నిర్వహించుకునే అవకాశం ఉండటాన్ని సవాలు చేస్తూ జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అలయన్స్‌ (జేఆర్‌సీఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ సూచనలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టీస్‌ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. మైనర్లను రక్షించేందుకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పాటించాల్సిన నిబంధనలు కేవలం మార్గదర్శకాలకే పరిమితం కాకుండా, మధ్యవర్తిత్వ నిబంధనల కింద వాటికి చట్టబద్ధమైన రూపం కల్పించే అంశాన్ని పరిశీలించాలని జస్టిస్‌ జయమాల్య బాగ్చి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని మెహతా తెలిపారు. ఒప్పందాలు కుదుర్చుకోవడానికి చట్టపరంగా అనుమతి లేకపోయినప్పటికీ.. మైనర్లు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో స్వతంత్రంగా ఖాతాలను సృష్టించుకోవడం, నిర్వహించుకోవడం వంటి చర్యలను ఈ పిటిషన్ సవాలు చేసింది. ముఖ్యంగా యువత కోసం సోషల్ మీడియాలోని కంటెంట్‌ను నియంత్రించాలని ఇటీవల పలువురు సూచిస్తున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్