- ఎనిమిది నెలల్లో మరో 8.. మొత్తం 32కు చేరిక
న్యూఢిల్లీ : దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే పేర్కొంది. తాజా గణాంకాల ప్రకారం..గడిచిన ఎనిమిది నెలల్లోనే మరో ఎనిమిది సంస్థలను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) నకిలీ వర్శిటీల జాబితాలో చేర్చింది. దీంతో ఇలాంటి వర్శిటీల సంఖ్య 32కు చేరింది. ఈ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి మూసివేయాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రాజ్యసభలో బిజెపి ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లిఖితపూర్వక సమాధానం చ్చారు. యుజిసి ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం ప్రస్తుతం దేశంలో 32 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో ఇదే అంశంపై రాజ్యసభలో ఇచ్చిన సమాధానంలో దేశంలో 24 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. అంటే కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో మరో ఎనిమిది నకిలీ సంస్థలు వెలుగులోకి వచ్చినట్టు తాజా గణాంకాలు చెప్తున్నాయి. అఖిల భారత ఉన్నత విద్యా సర్వే ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 1,289 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.







కామెంట్‌లు (0)