లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్, ఇటావా జిల్లాల్లో బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హస్నాపూర్, చంద్‌పూర్ గ్రామాల్లో రాత్రి సమయంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. విగ్రహాల ధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, వారిలో అధికశాతం దళితులు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరసనలకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు రెండు గ్రామాల్లోనూ కొత్త అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉన్నావ్‌లోని హస్నాపూర్ గ్రామం సోహరమౌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో పోలీసు బలగాలను మోహరించారు. ఇటావా జిల్లాలోని చంద్‌పూర్‌లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అనంతరం పరిస్థితి సాధారణంగా, ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలను దళిత సమాజాన్ని అవమానించేందుకు జరిగిన కుట్రగా కాంగ్రెస్ అభివర్ణించింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూస్వామ్య శక్తులు మరింతగా రెచ్చిపోతున్నాయని యూపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ కుమార్ లల్లు ఆరోపించారు.








కామెంట్‌లు (0)