- ఢిల్లీ వర్శిటీ విద్యార్థి ఆకృతి చౌధురి అరెస్టుపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం
- తక్షణమే విడుదల చేసి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశం
అలహాబాద్ : కనీస వేతనాల కోసం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పారిశ్రామిక వాడల్లోని కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలియజేసిన ఢిల్లీ యూనివర్శిటీ న్యాయ విద్యార్థి ఆకృతి చౌధురి (25)ను అరెస్టు చేయడం పట్ల అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కట్టుకథల ఆధారం’గా అరెస్టులు చేస్తారా? అక్రమంగా నిర్బంధిస్తారా? అంటూ యుపి పోలీసులను నిలదీసింది. ఈ మేరకు జస్టిస్ అతుల్ శ్రీధర్, జస్టిస్ అచల్ సచ్‌దేవాతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆకృతిని తక్షణమే విడుదల చేయాలని, అంతేకాకుండా అక్రమంగా నిర్బంధించినందుకు నష్ట పరిహారం కింద ఆమెకు రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆకృతి తరపు న్యాయవాది చార్లీ ప్రకాశ్, సీనియర్ అడ్వకేట్ కోలిన్ గాన్సాల్వెస్ మాట్లాడుతూ ‘ఆకృతి అరెస్టు, నిర్బంధానికి సంబంధించి ప్రభుత్వం సమర్పించిన పత్రాల్లో తీవ్రమైన లోపాలను కోర్టు గుర్తించింది. ఆమెకు ఐదు లక్షలరూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా నోయిడా జిల్లా మెజిస్ట్రేట్‌ని ఆదేశించింది" అని తెలిపారు. అలహాబాద్ హైకోర్టు తీర్పును ప్రముఖ న్యాయకోవిదులు ప్రశాంత్ భూషణ్ స్వాగతించారు. ఆకృతి నిర్బంధాన్ని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రశంసనీయమని, నోయిడా కార్మిక నిరసనలకు సంబంధించి పూర్తి దురుద్దేశపూరిత అభియోగాలతో యుపి పోలీసులు ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నారని ఆయన తెలిపారు.
ఆకృతిని ఎందుకు అరెస్ట్ చేశారు?
పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆకృతి ఢిల్లీ యూనివర్శిటీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తోంది. నోయిడా కార్మిక నిరసనలకు సంబంధించి అరెస్టయిన అనేక మంది కార్యకర్తల్లో ఆకృతి చౌధురి ఒకరు. పొరుగున ఉన్న హర్యాణాతో సమానంగా తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి 18 వరకు పారిశ్రామిక, కాంట్రాక్ట్ కార్మికులు నిరసనకు దిగారు. ఏప్రిల్ 13న నిరసనలపై యుపి సర్కార్ తీవ్ర అణిచివేత చర్యలకు పాల్పడింది. పోలీసుల లాఠీఛార్జితో హింసాత్మకంగా మారాయి. దీంతో కార్మికులు రోడ్లను దిగ్బంధించారు. కాగా పోలీసులే కార్మికులపై దాడికి పాల్పడినా.. నిరసనకారులపైనా, కార్మిక సంఘాల నాయకులపైనా, పలువురు సామాజిక కార్యకర్తలపైనా అక్రమ కేసులు బనాయించారు. ఈ క్రమంలోనే కార్మికులు రాళ్లు విసరడం, దహనకాండకు పాల్పడేలా ప్రేరేపించారని ఆరోపిస్తూ ఒక నెల రోజుల తరువాత జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఆకృతిపై కేసు నమోదు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా తమ వద్ద బలమైన ఎలక్ట్రానిక్, వీడియో ఆధారాలు ఉన్నాయని ఓ మీడియా సమావేశంలో పోలీసులు పేర్కొన్నారు. కానీ, ఏప్రిల్ 13న హింస చెలరేగడానికి ముందే తనను అదుపులోకి తీసుకున్నట్టు ఆకృతి తన పిటిషన్‌లో వాదించారు. తనను నిర్బంధంలోకి తీసుకోవడానికి తగిన నిజమైన ఆధారాలు లేవని, తన ముందస్తు నిర్బంధ ప్రక్రియ చట్టవిరుద్ధమని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
నోటీసు ఇవ్వలేదని పోలీసుల అంగీకారం
ఆకృతిని ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10:56 గంటలకు అరెస్టు చేసి, బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 130 కింద వార్నింగ్ (హెచ్చరిక) నోటీసు జారీచేసినట్టు యుపి ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే హెచ్చరిక జారీ చేయడానికి ముందే ఆమెకు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదని జస్టిస్ శ్రీధరన్ ప్రశ్నించారు. సెక్షన్ 126 కింద ఆకృతికి ఎలాంటి నోటీసు ఇవ్వలేదని పోలీసులు అంగీకరించారు. ఆ తర్వాత జనరల్ డైరీ తెప్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. నోటీసుకు ముందే ఆకృతి చౌధురిని అరెస్టు చేసినట్టు డైరీ బయటపెట్టింది. అరెస్టుకు ముందు ఆకృతిని ఏదైనా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారా? అని హైకోర్టు ప్రశ్నించింది. నిరసనకారులను రెచ్చగొట్టారని చెప్పడానికి గల ఆధారాలను కూడా సమర్పించాలని ఆదేశించింది. ఘటనాస్థలి వద్ద ఆందోళనకారులు ఏప్రిల్ 11నే గుమిగూడినట్టు పోలీసులు తెలిపారు. అయితే పోలీసు రికార్డుల ప్రకారం ఆ రోజు ఎలాంటి హింస జరగలేదని కోర్టు గుర్తించింది. నిరసనకారులు రాళ్లు విసిరి, వాహనాలను దహనం చేసేలా ఆకృతి చౌధురి ప్రేరేపించారనే ఆరోపణలకు సంబంధించి వీడియో ఫుటేజీని సమర్పించడంలో కూడా పోలీసులు విఫలమయ్యారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆమెను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ పరిహారం కూడా చెల్లించాలని నిర్దేశించింది.







కామెంట్‌లు (0)