విజయవాడలో ఇళ్ల నిర్మాణాలపై అనధికార టాక్స్ లు వసూలు చేస్తున్న నేతల దురాగతాలపై విచారణ జరపాలి, శిక్షించాలి
రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో అవినీతి నేతలను గెలిపిస్తే... విజయవాడను అమ్మేస్తారు, తస్మాత్ జాగ్రత్త!
పేదల ఇళ్లను పంచుకొని, అమ్ముకుంటున్న నేతలను నిలదీయండి, ఇళ్ళు, ఇళ్ల స్థలాలకై పోరాడండి
అమరావతితో పాటు సమాంతరంగా విజయవాడను అభివృద్ధి చేయటంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
అవినీతిపరులు,రౌడీలకు రాజకీయాలు, పదవులు అప్పగించవద్దు... పౌర సమాజం, నీతివంతులు ముందుకు రావాలి, ఎన్నికల్లో చురుకైన పాత్ర నిర్వహించాలి
నగరాభివృద్ధికై సిపిఎం, కమ్యూనిస్టులు, అభ్యుదయ వాదులతో చేతులు కలపండి
విజయవాడలో సిపిఎం ప్రజాపోరుయాత్ర, ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు
విజయవాడ : నేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ నుండి, సిపిఎం సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా పోరు పాదయాత్ర ప్రారంభమయ్యింది. ఈ పాదయాత్ర ఆర్.సి.యం చర్చ్, పి అండ్ టి కాలనీ, కృష్ణ హోటల్ సెంటర్, ఎక్సెల్ ప్లాంట్, పైపు ల రోడ్డు, శాంతినగర్ తదితర ప్రాంతాలలో సాగింది. బాబురావుతోపాటు సిపిఎం నగర నేతలు బి.రమణ రావు, కే.దుర్గారావు తదితరులు ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు, వారితో మాట్లాడారు, పలుచోట్ల ప్రసంగించారు. అమరావతితోపాటు విజయవాడ నగరాన్ని సమాంతరంగా అభివృద్ధి చేయాలని, నిధులు కేటాయించాలని, ఇల్లు లేని పేదలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, కట్టి ఖాళీగా ఉన్న ఇళ్లను పేదలకు ఇవ్వాలని, బుడమేరు ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని, ఇంటి పన్నులు ప్రతి సంవత్సరం పెంచే ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న పెన్షన్లను తక్షణమే విడుదల చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టి, చౌక ధరలకు రేషన్ డిపోల ద్వారా అందించాలని కోరుతూ ఈ పాదయాత్ర జరిగింది. నిత్యావసర వస్తువుల ధరల భారం పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఏ సరుకులు ఇవ్వడం లేదని ఆవేదనతో వెల్లడించారు, సంక్షేమ పథకాలు, పెన్షన్లకు విద్యుత్ బిల్లులతో ముడి పెట్టడం దుర్మార్గమని వాపోయారు, వంటగ్యాస్ సబ్సిడీ సక్రమంగా విడుదల కావడం లేదని తెలిపారు, ఆరోగ్యశ్రీ, ఈఎస్ఐ లో కూడా పూర్తి వైద్యం అందడం లేదని, వేల రూపాయలు ప్రైవేటు ఆసుపత్రులు అదనంగా డబ్బులు గుంజుతున్నాయని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బాబురావు, ఇతర నేతలు మాట్లాడుతూ .... బియ్యం మొదలు నిత్యవసర వస్తువుల ధరలు భారం పెరిగి సామాన్యులు తీవ్ర ఆందోళనతో ఉండగా, పాలకులు మొద్దు నిద్రలో ఉండటం సిగ్గుచేటన్నారు. కష్టాల్లో ప్రజలుంటే.. రోజుకు ఒక పండగ, ఈవెంట్ ..పట్టాభిషేకం.. పేరు చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ, ప్రజలను మభ్యపెట్టడం తగదు అని చెప్పారు. ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల ఖర్చుతో, ఐదు రోజుల్లో త్రీ డి ఇళ్ళు కడతామని పాలకులు 3 డి సినిమా చూపిస్తున్నారని అన్నారు. ఐదు రోజులు కాదు కదా.. ఐదు సంవత్సరాల నుండి అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయలేని అసమర్ధ పాలన సాగుతోందన్నారు. గత పదేళ్ల నుండి టిట్కో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. జవహర్లాల్ నెహ్రూ స్కీము ఇళ్ళు కట్టి 10 ఏళ్లయినా.. ఇప్పటికీ పేదలకు కేటాయింపులు జరగలేదు, వాటిని నేతలు పంచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు అని చెప్పారు. ఇళ్లు అమ్ముకుంటున్న నేతలపై ముఖ్యమంత్రి విచారణ జరిపించాలన్నారు, అవినీతి కుంభకోణాల్ని ఆపాలి, పేదలకు ఇళ్లు ఇవ్వాలని కోరారు. విజయవాడ నగరంలో సొంత స్థలంలో, సొంత డబ్బుతో ఇల్లు నిర్మించుకుంటున్న ప్రజలను నేతలు పీక్కుతింటున్నారు... ఒక్కొక్క నిర్మాణానికి పదివేల నుండి 10 లక్షల రూపాయల వరకు అనధికార టాక్స్ లు వసూలు చేస్తున్నారు, దీని కొరకు ప్రత్యేక వ్యక్తులను కేటాయించి, అవినీతిని వ్యవస్థీకృతం చేశారని ఆరోపించారు. అవినీతి అధికారులనే కాదు... నిర్మాణాలపై కోట్ల రూపాయలు వసూలు చేసిన, చేస్తున్న నేతలపై విచారణ జరపాలని, వారిని శిక్షించాలని, వారు పదవులకు అర్హులు కాదు, వారిని జైల్లో పెట్టాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థని పాలకులు బ్రష్టు పట్టించారని, అవినీతిమయం చేశారని, సాధారణ ప్రజలకు ఏ పనులు జరగటం లేదు అని అన్నారు. గత ఆరేళ్లలో 130 శాతం పైగా ఇంటి పన్నులు పెరిగాయన్నారు. కృష్ణా నది తీరాన ఉన్నా దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువగా మంచినీటి చార్జీలు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. ఇళ్లల్లోని మరుగుదొడ్లను లెక్కించి, భూగర్భ డ్రైనేజీ చార్జీలు నూతన కనెక్షన్ కి వేల రూపాయలు రుసుములు వసూలు చేస్తున్నారని బాబూరావు తెలిపారు. పన్నులు వసూళ్లే తప్ప, పనులు లేవు, కనీస సదుపాయాలు కరువయ్యాయన్నారు. కలుషిత నీటితో, డయేరియాతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని, దోమలు చెండాడుకు తింటున్నాయని, చిన్నపాటి వర్షాలకే నగరం మునిగిపోతోందని,అయినా పాలకులకు చీమకుట్టినట్టు లేదు అని దుయ్యబట్టారు. రెండు సంవత్సరాల క్రితం బుడమేరు వరదల్లో లక్షల మంది నగర ప్రజలు నరకయాతన అనుభవించారని, స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం ప్రజలకు మొహం కూడా చూపించలేదనీ, దాతలు వందలాదికోట్ల రూపాయలు ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చినా, ప్రజలకు అవి పూర్తిగా అందలేదు అని అన్నారు. చిన్న వర్షం వస్తే బుడమేరు ముంపు వస్తుందనే భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు, ఎంతకాలం ఇలా బతకాలి ? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం బుడమేరు ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టలేదు, అమరావతిలో ముంపు నివారణకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లే.. విజయవాడలో ఎందుకు ఖర్చు పెట్టరు ? అని అడిగారు. 15 లక్షల మందికి పైగా నివసిస్తున్న విజయవాడ అభివృద్ధి... ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి పట్టదా ? అని అడిగారు. నగరంలోని కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు సొంత సంపాదనే తప్ప, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదు, నగరానికి సాధించింది లేదు అని చెప్పారు. ఇటువంటి అవినీతిపరులు, స్వార్థపరులైన నేతలు, వారి కుటుంబ సభ్యులు.. విజయవాడకు ఎవరు దిక్కు లేనట్లు మేయర్ తో సహా కార్పొరేట్ పదవుల కోసం ఆరాటపడుతున్నారని అన్నారు. అవినీతి నేతలను, వారి అనుచరులను, కుటుంబ సభ్యులను ఎన్నికల్లో గెలిపిస్తే... విజయవాడ ను అమ్మేస్తారు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. నగరంపై కనీస అవగాహన లేని వారు, సమస్యలు పట్టని వారు, అవినీతిలో మునిగితేలే వారికి రాజకీయాలు అప్పగించవద్దు, పదవులను కట్టబెట్టకండి అని బాబూరావు పిలుపునిచ్చారు. పౌర సమాజం ముందుకు రావాలి, నగరాన్ని కాపాడుకోవాలి, నీతివంతులు నడుం బిగించాలి, విజయవాడ నగర రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్నారు. సిపిఎం, కమ్యూనిస్టుల హయాంలో విజయవాడ నగరపాలక సంస్థ పన్నుల భారాలు పెంచకుండానే ఆదర్శవంతమైన పాలన సాగింది, ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారని అన్నారు. అజిత్ సింగ్ నగర్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, బుడమేరుపై వంతెన, స్టేడియం, కృష్ణానది మంచినీరు ,పేదలకు ఇళ్ల పట్టాలు, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కమ్యూనిస్టుల హయాంలో ప్రజాప్రతినిధులు సాధించారు, పోరాడారు అని గుర్తు చేశారు. సిపిఎం ప్రజా సమస్యల పరిష్కారానికై ఒకవైపు పోరాటం, మరోవైపు విజయవాడ నగర అభివృద్ధికై ఎన్నికల్లో రాజకీయ పోరాటం సాగిస్తుందన్నారు. కమ్యూనిస్టులు, అభ్యుదయ శక్తులు, నగరాభివృద్ధిని కోరుకునే సామాజిక కార్యకర్తలు ఉమ్మడిగా కృషి చేయాలి, విజయవాడ నగరాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ పోరులో కలిసి రండి, సాధారణ ప్రజలు భాగస్వాములు కండి, పాలకుల దుర్మార్గాల నుండి రాష్ట్రాన్ని, విజయవాడ నగరాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. దేశంలో సాధారణ ప్రజలకు ఓటు హక్కు కూడా లేకుండా చేస్తున్న కేంద్ర పాలకులకు, వారితో జతకట్టిన పార్టీలకు బుద్ధి చెప్పండి అని బాబూరావు అన్నారు. నేడు జరిగిన ఈ పాదయాత్రలో బాబురావు తో పాటు, సిపిఎం నేతలు రమణారావు, కే దుర్గారావు, టి ప్రవీణ్, సిహెచ్ శ్రీనివాస్, ఝాన్సీ, నిజాముద్దీన్, శివ ,ఎం. బాబురావు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)