- కాల్పుల విరమణ తర్వాత కూడా 300 మంది చిన్నారుల హత్య
- ఐక్యరాజ్య సమితి వెల్లడి
న్యూయార్క్ : గాజాలో కాల్పుల విరమణ తర్వాత కూడా ఇజ్రాయిల్ దాష్టికాలు కొనసాగుతునే వున్నాయి. ఉధృతంగా మిలటరీ దాడులు, తుపాకీ కాల్పులు, శతఘ్ని గుళ్ళ వర్షం ఇలా అన్ని రకాలుగా దాడులకు పాల్పడుతునే వుందని ఐక్యరాజ్య సమితి గురువారం పేర్కొంది. గతేడాది అక్టోబరులో గాజాలో కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుండి గత 300 రోజుల కాలంలో కనీసం 300మంది చిన్నారులు ఇజ్రాయిల్ ఘాతుకాలకు బలయ్యారని యుఎన్ బాలల నిధి పేర్కొంది. అంటే సగటున రోజుకు ఒకరు చొప్పున చిన్నారి కన్నుమూశారని పేర్కొంది. ఈ ఏడాది మొదటి ఏడు మాసాల్లో ఇజ్రాయిల్ దాడులకు సంబంధించి 1380 సంఘటనలను ఒసిహెచ్‌ఎ నమోదు చేసింది. ఇదే కాలంలో 2300మందికి పైగా పాలస్తీనియన్లు నిర్వాసితులయ్యారు. సుదీర్ఘమైన యుద్ధం కారణంగా అత్యంత క్లిష్టంగా వున్న పరిస్థితుల్లో పిల్లలు జీవించాల్సి వస్తోందని యుఎన్ పేర్కొంది. కిక్కిరిసిన శిబిరాలు, పరిమిత వనరులతో, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ సౌకర్యాలు కూడా అందుబాటులో లేకుండా అత్యంత దయనీయంగా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి పరిధిలో చేయగలిగినంతా సాయం చేస్తున్నామని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల విభాగ కార్యాలయం (ఒసిహెచ్‌ఎ) పేర్కొంది.








కామెంట్‌లు (0)